Heart attack: గుండె పోటుతో కుర్రాడు మృతి.. వయసెంతో తెలుస్తే నివ్వెరపోతారు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-02-26T16:08:58+05:30 IST

యువత గుండె లయ తప్పుతోంది... ఉన్నట్టుండి ఆగిపోతోంది... అప్పటివరకూ కళ్లముందే నవ్వుతూ కనిపించిన వ్యక్తులు పిట్టల్లా నేలరాలుతున్నారు...

Heart attack: గుండె పోటుతో కుర్రాడు మృతి.. వయసెంతో తెలుస్తే నివ్వెరపోతారు.. వీడియో వైరల్

నిర్మల్: యువత గుండె లయ తప్పుతోంది... ఉన్నట్టుండి ఆగిపోతోంది... అప్పటివరకూ కళ్లముందే నవ్వుతూ కనిపించిన వ్యక్తులు పిట్టల్లా నేలరాలుతున్నారు... ఈ విధంగా హార్ట్ ఎటాక్‌తో (Heart attack) యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటివల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇదే తరహా మరో ఘటన వెలుగుచూసింది.

నిర్మల్ జిల్లా (Nirmal district) కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో (Marriage) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రిసెప్షన్‌కు హాజరైన ముత్యం అనే 19 ఏళ్ల యువకుడు హుషారుగా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో (Heart attack while dancing) కుప్పకూలాడు. అప్పటివరకు సరదాగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన ఆ కుర్రాడి ప్రాణాలను హార్ట్‌ స్ట్రోక్ (Heart stroke) కబళించివేసింది. యువకుడి డ్యాన్స్ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అయ్యాయి.

కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లోని పార్డి(కే) గ్రామానికి చెందిన కిష్టయ్య ఓ వ్యక్తి కుమారుడి వివాహం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో శుక్రవారం జరిగింది. మరుసటి రోజు శనివారం పార్డి(కే) గ్రామంలో విందు కార్యక్రమం నిర్వహించారు. పెళ్లింటి కుటుంబానికి సమీప బంధువైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు ఈ వేడుకకు హాజరయ్యాడు‌‌. రాత్రి రిసెప్షన్ సమయంలో సరదగా డ్యాన్స్ చేశాడు. అందరూ చూస్తుండగా చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేసిన ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలాడు.

అంతే.. అతడిలో ఉలుకూ పలుకూ లేదు. తీరా చూస్తే గుండె పోటుతో అతడి ప్రాణాలు పోయాయని తేలింది. బైంసా ఏరియా ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు. అప్పటివరకు అంత ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన యువకుడు ఈ విధంగా కన్నుమూయడం వివాహానికి విచ్చేసిన బంధుగణాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 19 ఏళ్ల యువకుడు గుండె పోటుతో కన్నుమూయడం ఏంటో ఈ విధిరాత అంటూ చింతిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి...

గుండెకు సంబంధించిన మరణాల్లో దాదాపు సగం అకస్మాత్తుగా సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఛాతీలో హఠాత్తుగా నొప్పి రావడమనేది చాలా అరుదుగా జరిగే విషయం. కాబట్టి గుండెనొప్పి మెల్లగా మొదలై.. ముందుకు, వెనక్కి, పక్కలకి పాకుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి అనేది లేకున్నా.. అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది తగ్గిపోతూ, మళ్లీ వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలుంటే.. గుండె సంబంధిత సమస్యలని భావించి, వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం పనికిరాదు. సాధారణంగా ఛాతీ మధ్యలో మొదలైన నొప్పి ఎడమవైపు, వెనక్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ కుడివైపు వెళ్తూంది. ఒక్కోసారి రెండు వైపులకూ నొప్పి విస్తరిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎడమవైపు భుజం నుంచి మణికట్టు వరకు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్య చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-02-26T16:16:58+05:30 IST