Airport: ఎయిర్‌పోర్ట్‌లో నూతన విధానం అమల్లోకి.. అదేంటంటే..

ABN , First Publish Date - 2023-06-02T12:02:06+05:30 IST

విమానాశ్రయంలో రన్‌వేలపై దిగిన విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు సులభంగా తరలించే సాంకేతిక పరికరాల వినియోగం గురువారం

Airport: ఎయిర్‌పోర్ట్‌లో నూతన విధానం అమల్లోకి.. అదేంటంటే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక మీనంబాక్కం విమానాశ్రయంలో రన్‌వేలపై దిగిన విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు సులభంగా తరలించే సాంకేతిక పరికరాల వినియోగం గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ఈ పరికరాల్లోని సిగ్నల్‌ ఆధారంగా పైలెట్లు రన్‌వే ప్రాంతం నుంచి పార్కింగ్‌ ఏరియాకు విమానాలను సులువుగా చేర్చగలుగుతారు. విమానాశ్రయం(Airport)లో రన్‌వేలో దిగే విమానాలను పార్కింగ్‌ చేసేందుకు వందకుపైగా పార్కింగ్‌ ప్రదేశాలున్నాయి. వీటిలో 95 పార్కింగ్‌ ప్రాంతా ల్లో విమానాలను నిలిపుతున్నారు. ముందుగా విమానాలు రన్‌వేపై ల్యాండింగ్‌ అయిన తర్వాత టాక్సీవే రహదారికి వచ్చి, ఆ తర్వాతే పార్కింగ్‌ ప్రాంతాన్ని చేరుతాయి. రన్‌వే నుంచి విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు చేర్చేందుకు విమానాశ్రయ గ్రౌండింగ్‌ సిబ్బంది సాయపడతారు. ఈ సిబ్బంది చేతుల్లో సిగ్నల్‌ పట్టుకుని సైగలు చేస్తారు. వాటిని చూస్తు పైలెట్లు విమానాన్ని పార్కింగ్‌ ప్రాంతానికి చేర్చుతారు. అయితే తుఫాను, వర్షాల సమయంలో సిగ్నల్స్‌ ప్రకారం పైలెట్లు విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు చేర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రన్‌వే నుంచి విమానాలను పార్కింగ్‌ ప్రాంతానికి తరలించేందుకు విదేశాల్లో అమలుచేస్తున్న అడ్వాన్స్‌ విజువల్‌ టేకింగ్‌ గైడెన్స్‌ సిస్టమ్‌ (మార్గదర్శక) పరికరాలు అమర్చాలని కేంద్ర విమానయాన సంస్థ నిర్ణయించింది. ఇటీవలే మీనంబాక్కం విమానాశ్రయంలో 50 పరికరాలను అమర్చారు. మూడు రోజుల క్రితం ఆ మార్గదర్శక సిగ్నల్స్‌ పనితీరును పరిశీలించి విమానాశ్రయ భద్రతాదళం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరికరాల వినియోగం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. విమానాలు రన్‌వే(Runway) ప్రాంతం నుంచి టాక్సీవేకు చేరిన తర్వాత పైలెట్లు 60 మీటర్ల దూరంలో కాక్‌పిట్‌కు సమానమైన ఎత్తులో అమర్చిన పరికరంలోని సిగ్నల్స్‌ బట్టి విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు సులువుగా చేర్చగలిగారు. ఈ పరికరం సిగ్నల్స్‌ను పైలెట్లు అతిక్రమిస్తే వింత శబ్దంతో అప్రమత్తం కూడా చేస్తుందని అధికారులు తెలిపారు.

nani10.2.jpg

విమానం పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోగానే ఆ పరికరంలో ‘స్టాప్‌’ అనే ఎరుపు రంగుతో హెచ్చరిక చేస్తుందన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ పరికరాల సిగ్నల్స్‌ ఆధారంగా విమానాలను పార్కింగ్‌ ప్రాంతాలకు సులువుగా చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తక్కిన పార్కింగ్‌ ప్రాంతాల వద్ద కూడా ఈ సిగ్నల్‌ పరికరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-02T12:02:06+05:30 IST