Pig-To-Human Heart Transplant: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పంది గుండె.. రెండోసారి ఈ ఘనత సాధించిన యూఎస్ వైద్యులు..!
ABN , First Publish Date - 2023-09-24T10:59:19+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలోని (America) మేరీల్యాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అక్కడి వైద్యులు (Doctors) పంది గుండె (Pig Heart) అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు.
Pig-To-Human Heart Transplant: అగ్రరాజ్యం అమెరికాలోని (America) మేరీల్యాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి అక్కడి వైద్యులు (Doctors) పంది గుండె (Pig Heart) అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ (Lawrence Faucette) నేవీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో మరణానికి కూడా దగ్గరయ్యాడు. దీనికి తోడు అతనికి ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మార్పిడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో 'యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్' (University of Maryland Medicine) వైద్యులు తప్పనిసరి పరిస్థితులలో ఎంతో క్లిష్టమైన చికిత్సకి సిద్ధమమయ్యారు. అందుకు లారెన్స్ ఫాసెట్ కూడా అంగీకరించాడు.
దాంతో అతనికి ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది. కుర్చిపై కూడా కూర్చున్నాడని, జోకులు వేస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, రాబోయే రోజులు అతనికి చాలా కీలకం అని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. ఇదే 'యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్' డాక్టర్లు గతేడాది డేవిడ్ బెన్నెట్ (David Bennett) అనే వ్యక్తికి కూడా ఇలాగే పంది గుండెను అమర్చిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే బతికాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని ఈ సందర్భంగా వైద్యులు పేర్కొన్నారు.