Viral News: భార్య వేధింపులకు తాళలేక విడాకులు.. భరణం కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త.. వీధుల్లో వింత బ్యానర్‌తో హల్‌చల్

ABN , First Publish Date - 2023-03-01T12:26:34+05:30 IST

హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఫరీదాబాద్ నగరంలోని వీధుల్లో ఒక వింత బ్యానర్‌తో తిరుగుతు హల్‌చల్ చేస్తున్నాడు.

Viral News: భార్య వేధింపులకు తాళలేక విడాకులు.. భరణం కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త.. వీధుల్లో వింత బ్యానర్‌తో హల్‌చల్

ఫరీదాబాద్: హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఫరీదాబాద్ నగరంలోని వీధుల్లో ఒక వింత బ్యానర్‌తో తిరుగుతు హల్‌చల్ చేస్తున్నాడు. రోడ్లపై వెళ్లే జనం అయితే.. ఆగి మరి దాన్ని చదువుతున్నారు. అసలు అందులో ఏం ఉందంటే..! "నా కిడ్నీ అమ్మకానికి ఉంది. మార్చి 21న ఆత్మాహుతి కార్యక్రమం" అని రాసి ఉంది. ఈ ఆత్మాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, బిహార్ సీఎంలను కూడా ఆహ్వానించాడు. ఇక రోడ్డుపై ఈ వింత బ్యానర్‌తో అతడిని చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

బీహార్ రాజధాని పాట్నాకు చెందిన సంజీవ్‌ అనే వ్యక్త ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ఓ ప్రిటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. అతడికి ఆరేళ్ల క్రితం పెళ్లయింది. కొన్నాళ్లపాటు కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతే సంజీవ్‌కు కష్టాలు మొదలయ్యాయి. వివాహమైన తర్వాత అతని భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అతని కుటుంబంపై వరకట్నం కేసు పెడతామని బెదిరింపులకు దిగారు. అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అక్కడే అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ, తిరిగి సంజీవ్ వద్దకు రావడానికి ఆమె నిరాకరించడంతో పాటు భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దాంతో అరెస్టైన సంజీవ్.. కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. దాదాపు 6ఏళ్ల నుంచి ఈ కేసు నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు భార్య తనకు విడాకులు కావాలని కోరుతుంది. అంతేగాక భరణంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుందట.

ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

దాంతో సాయం కోసం పోలీసులు, అధికారుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానీ, సంజీవ్‌కు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో విసిగిపోయిన అతడు ఇలా బ్యానర్‌తో ఫరీదాబాద్ వీధుల్లో తిరుగుతున్నాడు. మార్చి 21వ తేదీలోపు కిడ్నీ విక్రయిస్తే ఆ నగదు తన భార్యకు ఇస్తానని చెబుతున్నాడు. ఒకవేళ అది జరగని పక్షంలో అదే రోజు సూసైడ్ చేసుకుంటానని తెలిపాడు. ఇందులో భాగంగానే 21న పట్నాలో ఆమరణ నిరాహార దీక్ష, ఆత్మాహుతి కార్యక్రమం ఉంటుందని బ్యానర్‌పై వేయించాడు. అంతేగాక ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తూ బ్యానర్‌పై వారి పేర్లను సైతం ముద్రించాడు. బ్యానర్ రెండోవైపు భార్య, బావమరిది, వారి బంధువుల ఫొటోలను ముద్రించాడు. అలాగే ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న చిరునామాతో పాటు తన మొబైల్ నంబర్ బ్యానర్‌పై వేశాడు. ఇక వీధుల్లో సంజీవ్ ఇలా వింత బ్యానర్‌తో తిరుగుతుండడం చూసి రోడ్లపై వెళ్లేవారు తమ వాహనాలు ఆపి మరీ.. సంజీవ్ బాధను తెలుసుకుంటున్నారు. వారిలో కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడీ వార్త వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి: ఎలాన్ మస్క్‌కు పూజలు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!

Updated Date - 2023-03-02T07:33:29+05:30 IST