Shocking: పాపం.. బుడ్డోడు.. కరోనా చికిత్స ఎంత పని చేసిందో..!
ABN , First Publish Date - 2023-09-07T12:56:43+05:30 IST
మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెండేళ్ల పాటు కంటిమీద కునుకులేకుండా చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు రెండేళ్ల పాటు కంటిమీద కునుకులేకుండా చేసింది. వివిధ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను కరోనా హడలెత్తించింది. ఆ తర్వాత వ్యాక్సిన్స్ అందుబాటులోకి రావడంతో కోవిడ్-19 (Covid-19) ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని కేసులు వస్తున్నాయి. అయితే, తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ ఘటన తాలూకు వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బుడ్డోడికి కరోనా చికిత్స (Coronavirus Treatment) వికటించడంతో వింత పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది ఆ వార్త సారాంశం.
అసలేం జరిగిందంటే.. మహమ్మారి సోకిన ఆరు నెలల బాలుడికి వైద్యులు కోవిడ్ చికిత్స చేయగా, అతని కళ్లు నీలం రంగులోకి మారిపోయాయి. చికిత్సలో భాగంగా తన కుమారుడికి వైద్యులు ఫెవిపిరావిర్ మెడిసిన్ (Favipiravir medication) ను మూడు రోజులు ఇచ్చినట్లు తల్లి పేర్కొంది. అయితే, నాలుగో రోజు తన కొడుకు కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి నీలంలోకి మారడాన్ని తాను గమనించినట్లు తెలిపింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుళ్లింది. దాంతో వైద్యులు బుడ్డోడికి అందిస్తున్న చికిత్సను తక్షణమే నిలిపివేశారు. అలా ట్రీట్‌మెంట్ ఆపేసిన ఐదు రోజుల తర్వాత బాలుడి కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశాయి. దాంతో వైద్యులు, పిల్లోడి పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఫెవిపిరావిర్ మెడిసిన్ దుష్ఫ్రభావంతోనే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.