Chennai: ఈ కర్మాగారంతో రెండు వేలమందికి ఉపాధి.. ఇంతకీ ఏంటా ఫ్యాక్టరీ అంటే..

ABN , First Publish Date - 2023-05-10T12:19:48+05:30 IST

తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పెరువాయల్‌లోని మహేంద్ర ఆరిజాన్స్‌ ప్రాంతంలో రూ.1891 కోట్లతో

Chennai: ఈ కర్మాగారంతో రెండు వేలమందికి ఉపాధి.. ఇంతకీ ఏంటా ఫ్యాక్టరీ అంటే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పెరువాయల్‌లోని మహేంద్ర ఆరిజాన్స్‌ ప్రాంతంలో రూ.1891 కోట్లతో మిత్బుబిషి ఎలక్ర్టిక్‌ ఇండియా సంస్థ నెలకొల్పనున్న ఏసీ మెషిన్లు, కంప్రెషర్ల తయారీ కర్మాగారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. చెన్నైలో మంగళవారం ఉదయం రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్‌కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌, సింగపూర్‌కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు అనుబంధంగా ఉన్న మిత్సుబిషి ఎలక్ర్టిక్‌ ఇండియా సంస్థ ఈ కొత్త పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో ప్రభుత్వం తరఫు, సంస్థ తరఫు ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

జపాన్‌తో వాణిజ్య సంబంధాలు పటిష్ఠం

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ... డీఎంకే ప్రభుత్వం జపాన్‌తో పటిష్టమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంటోందని, దేశంలో జపాన్‌కు చెందిన కంపెనీలు రాష్ట్రంలో అధికంగా పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. అంతే కాకుండా జపాన్‌ దేశస్థులు అధికంగా నివసిస్తున్న నగరంగా చెన్నై పేరుగడించిందని చెప్పారు. ఈ నెల 23న విదేశీ పెట్టుబడుల సమీకరణ నిమిత్తం జపాన్‌ పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో ఆ దేశానికి చెందిన మిట్సుబిషి అనుబంధ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం, గుమ్మిడిపూండి సమీపంలో ఏసీ మిషన్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. పెరువాయల్‌ ప్రాంతంలో 52 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ కర్మాగారం ద్వారా సుమారు రెండు వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తంగం తెన్నరసు, రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక వాణిజ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌, మార్గదర్శక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి విష్ణు, మిట్సుబిషి ఎలక్ర్టిక్‌ కార్పొరేషన్‌ గ్రూపు చైర్మెన్‌ యాసుమిషీ టస్నోకి, మిట్సుబిషి ఎలక్ట్కానిక్స్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కసుహికో టామురా, జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ టాకా మషాయుకీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-10T12:22:10+05:30 IST