Mango Kernel: ఎందుకూ పనికిరావని మామిడి కాయలను తినేశాక టెంకలను పారేస్తున్నారా..? ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-06-03T12:44:37+05:30 IST
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే.
Mango Kernel: పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వేసవికాలం (Summer) వచ్చిందంటే చాలు.. మామిడిపండ్లు (Mangoes) ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. మామిడిలో రుచి, కమ్మదనం కంటే అది అందించే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇక మన దగ్గర మామిడిపండ్లు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగుల్లో లభిస్తుంటాయి. మన వద్ద లభించే వాటిల్లో ప్రధానంగా బంగినపల్లి, చౌసా, తోతాపురి, సఫేదా, ఆల్ఫోన్సో రకం వాటిని ఎంతో ఇష్టంగా తింటుంటాం.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, మనం మామిడిపండ్లు తిన్న తర్వాత టెంకలను ఎందుకూ పనికిరావని పారేస్తుంటాం కదా. ఇదిగో ఇక్కడే మనం పెద్ద తప్పు చేస్తున్నామని తెలుసా? ఎందుకంటే కేవలం మామిడిపండు వల్లే కాదు దాని టెంక వల్ల కూడా బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే. అసలు మామిడి టెంకల (Mango Kernels) వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎందుకూ పనికిరావని పారేసే టెంకను ఎలా ప్రయోజనకారిగా మార్చుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మామిడి టెంకలోని గింజలలో ఉండే పోషకాలు..
విటమిన్ బి6, ప్రొటీన్, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు మామిడి టెంకలో ఉండే గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. అంతేగాక వేసవిలో విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనతలను తొలగించడానికి కూడా మామిడి గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
మామిడి గింజలను తీసే ప్రాసెస్ ఇలా..
ముందుగా మామిడి టెంకలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిపోయాక టెంకలను పగలగొట్టి లోపల ఉన్న తెల్లని గింజలను తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు ఈ పొడిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. కింద పేర్కొన్న విధంగా ఈ పొడిని అనేక విధాలుగా వాడుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచే పానీయంగా..
రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మామిడి గింజల పొడి, ఒక చెంచా తేనె వేసి ప్రతిరోజూ ఉదయంపూట తాగాలి. ఆటోమెటిక్‌గా మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతోంది.
మామిడి గింజల బటర్..
మామిడి టెంక లోపల ఉండే తెల్లటి భాగాన్ని తీసి, దానికి కొద్దిగా నీళ్లు కలిపి మిక్సిలో వేయడం ద్వారా పేస్ట్‌లా అవుతుంది. అందులో అలోవెరా జెల్‌ని కలిపి ముఖానికి పట్టాలి. ఇది టానింగ్ సమస్యను (Problem of Tanning) తొలగిస్తుంది.
మామిడి సీడ్ 'టీ'..
మీరు మామిడి గింజలతో అద్భుతమైన టీ తయారు చేయవచ్చు. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఎసిడిటీ, గ్యాస్ సమస్యను కూడా దూరం చేస్తుంది.
దంతాలను శుభ్రపరచడానికి..
మామిడి గింజల పొడి సహజమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని దంతాలకు ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. దంతాలు శుభ్రం కావడంతో పాటు తెల్లగా మెరుస్తాయి.
మామిడి గింజల స్మూతీ..
మామిడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అలాంటప్పుడు మీరు దీన్ని ఏదైనా స్మూతీ, సూప్, ఇతర ఆహారాలలో ఉపయోగించవచ్చు. ఇది మీ ఆహారంలో ఫైబర్ శాతాన్ని పెంచడంలో ఉపయోకరంగా ఉంటుంది.