Elephants: రాష్ట్రంలో మొత్తం ఏనుగుల సంఖ్య ఎంతో తెలుసా...
ABN , First Publish Date - 2023-08-10T10:17:59+05:30 IST
రాష్ట్రంలోని అటవీ ప్రాంతం 26 రేంజ్‌లుగా విభజించారు. ఆ ప్రాంతాల్లో ఏనుగుల సంచారంపై ఐదేళ్లకోసారి గణిస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది గణన చేపట్టలేదు.
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 2,961కి పెరిగినట్లు అటవీ శాఖ సమీకృత సర్వే నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతం 26 రేంజ్‌లుగా విభజించారు. ఆ ప్రాంతాల్లో ఏనుగుల సంచారంపై ఐదేళ్లకోసారి గణిస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది గణన చేపట్టలేదు. ఈ నేపథ్యంలో, తమిళనాడు, కేరళ, కర్ణాటక(Tamil Nadu, Kerala, Karnataka) తదితర రాష్ట్రాల్లో గత మే 17, 18, 19 తేదీల్లో ఏనుగుల గణన చేపట్టారు. ఆ సర్వే నివేదికను మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి మదివేందన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, అటవీ శాఖ కార్యదర్శి సుప్రియ సాహు తదితరులున్నారు. మే నెలలో చేపట్టిన సర్వేలో 1,731 మంది శాఖ ఉద్యోగులు, 368 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3,496 చ.కి.మీ విస్తీర్ణంలో ఏనుగుల సంచారం ఉందన్నారు. సర్వే వివరాల ప్రకారం, 2017లో రాష్ట్రంలో 2,761 ఏనుగులుండగా, ప్రస్తుతం 200 ఏనుగులు అధికంగా అంటే 2,961 ఏనుగులున్నాయని తెలిసింది. ఆడ, మగ ఏనుగుల నిష్పత్తి 1:2.17గా ఉందన్నారు. పశ్చిమ కనుమల్లో 1,855, తూర్పు కనుమల్లో 1,105 ఏనుగులున్నట్లు అటవీ శాఖ సర్వేలో వెల్లడైంది.