Viral Video: పెళ్లి పీటలపై మామ మనుసు గెలుచుకున్న అల్లుడు.. ఇంతకీ ఇతడు చేసిన పనేంటంటే..
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:43 PM
పెళ్లిళ్లలో వధూవరుల మధ్య చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే మరికొందరు...
పెళ్లిళ్లలో వధూవరుల మధ్య చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే మరికొందరు మాత్రం సమాజానికి సందేశం ఇచ్చే పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. పెళ్లిపీటలపై ఓ వరుడు తన మామ మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వివాహానికి (Wedding viral videos) సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. జమ్మూలోని శివఖోడి ప్రాంతంలో జరిగిన వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరుడు పెళ్లి వేదికపై కూర్చుని ఉండగా.. అక్కడికి వధువు తండ్రి రూ.500 నోట్ల కట్టలతో (Bundles of notes) వస్తాడు వాటిని అల్లుడికి కట్నంగా (dowry) ఇవ్వబోతాడు. అయితే వరుడు మాత్రం ఇందుకు ససేమిరా అంటాడు. ఎంత బలవంతం చేసినా డబ్బు తీసుకునేందుకు ఒప్పుకోడు.
పదే పదే బలవంతం చేస్తుండడంతో చివరకు వాటిలో ఓ నోటును తీసుకుని, కళ్లకు అద్దుకుని మిగతా నగదును తిరస్కరిస్తాడు. పక్కన ఉన్న బంధువులు చెబుతున్నా కూడా అతడు మాత్రం డబ్బు తీసుకునేందుకు ఒప్పుకోడు. ఈ ఘటనను చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీస్తున్నారని భయపడ్డాడేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ వరుడు అందరికీ ఆదర్శం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.