Lady Finger vs Diabetes: చక్కెర వ్యాధికి, బెండకాయలకు అసలు లింకేంటి..? చాలా మందికి తెలియని నిజాలివీ..!
ABN , First Publish Date - 2023-11-15T11:57:52+05:30 IST
బెండకాయలు ఆరోగ్యానికి మంచివే అయినా.. ఇలా మాత్రం అస్సలు తినకూడదు..
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే దాన్ని మధుమేహం అంటారనే విషయం తెలిసిందే. ఒకసారి ఈ సమస్య మొదలైతే ఇక అది జీవితాంతం ఉంటుందని, నియంత్రించుకోవడం తప్ప వేరే దారి లేదని అంటారు. ఇది నిజమే అయినా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మధుమేహానికి కళ్లెం వేయచ్చు. కూరగాయలలో బెండకాయలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. వీటిని తింటే లెక్కలు బాగా వస్తాయనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే మధుమేహ రోగులకు బెండకాయలు గొప్ప వరం. అసలు డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు చేసే మేలు ఏంటి? బెండకాయకు చక్కెర వ్యాధి(Diabetes) నియంత్రణకు ఉన్న లింకేంటి? తెలుసుకుంటే..
బెండకాయల(lady finger)లో కరిగే పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది నీటిలో కరిగి జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. కరిగే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. భోజనం తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ విడుదల కాకుండా చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Breastfeeding: పాలిచ్చే తల్లులు అస్సలు చేయకూడని 9 పనులివే..!
పోషకాలు, కేలరీల విషయంలో బెండకాయ ది బెస్ట్. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, ఫోలెట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇక దీంట్లో కేలరీలు చాలా తక్కువ. సమతుల్య ఆహారంలో బెండకాయకు మంచి స్థానమే ఉంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇన్సులిన్ హార్మోన్ కారణంగానే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. అయితే బెండకాయలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేసే గుణాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు బెండకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు.
బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మధుమేహానికి సంబంధించిన ఇతర సమస్యలలో కూడా సహాయపడతాయి.
బెండకాయలు ఆరోగ్యానికి మంచివి కదా అని వాటిని ఏదో ఒక విధంగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా బెండకాయను డీప్ ఫ్రై చేసి తింటే ప్రయోజనాలు ఏమీ ఉండవు. వీటిని ఆవిరి మీద ఉడికించడం, లేదా తక్కువ నూనెలో వేయించి తినడం వల్ల మాత్రమే ప్రయోజనాలు పొందగలుగుతారు.