Naveen Murder Case : నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. అమ్మాయి పాత్రపై ఒక్క మాటతో తేల్చేసిన సీపీ..!
ABN , First Publish Date - 2023-03-04T17:55:00+05:30 IST
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు...
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ రోజుకో సంచలన విషయం వెలుగుచూడగా.. తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. నిందితుడు హరిహరకృష్ణ (Hari Hara Krishna), అతని స్నేహితురాలును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఇద్దర్నీ వేర్వేరుగా విచారించి, ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా పోలీసులు ఇప్పించారు. అయితే ఈ ఘటనపై మొదటిసారి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ (Rachakonda CP DS Chauhan ) మీడియాతో మాట్లాడారు. కేసులో అసలేం జరుగుతోంది..? ఇప్పటి వరకూ విచారణ ఎలా సాగింది..? ముఖ్యంగా అమ్మాయి పాత్రేంటి..? అనే విషయాలు ఒకే ఒక్క మాటతో తేల్చేశారు.
సీపీ ఏం చెప్పారంటే..?
‘ నవీన్ హత్య కేసులో అమ్మాయి పాత్ర ఉందని ఇప్పటివరకూ ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా హరిహరకృష్ణకు సహకరించిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కచ్చితంగా శిక్షపడేలా చూస్తాం. హరహర చేసిన పని నీచమైన పని.. ఇది మనుషులు చేసే పని కానే కాదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా ఎలాంటి వివరాలు వెల్లడించలేము’ అని డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఈ కేసులో అమ్మాయి పాత్ర ఉందని వార్తలు వచ్చినా ఇప్పటి వరకూ నిర్ధారణ కాకపోవడమేంటి..? అని నవీన్ తల్లిదండ్రులు (Naveen Parents) అనుమానిస్తున్నారు. విచారణలో అమ్మాయి.. నోరు మెదపకపోవడం, సడన్‌గా ఒకసారి నోరు తెరిచి ఎక్కువ ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందనే విషయం బయటికొచ్చింది. కచ్చితంగా అమ్మాయి పాత్ర ఉంటుందని మరింత లోతుగా విచారిస్తే నిజానిజాలు బయటికొస్తాయని పోలీసులు భావిస్తున్నారట. మరోవైపు.. అమ్మాయి పాత్ర లేదనేది అవాస్తవమని.. నిజంగా ఇది పెద్ద ట్విస్టే అని అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
దర్యాప్తులో సంచలన విషయాలు..
ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను రెండోరోజు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ‘ పోస్టుమార్టం ఎలా చేయాలి..? శరీర భాగాలను ఎలా వేరుచేయాలి అనే విషయాలను యూట్యూబ్‌లో (Youtube) ఎక్కువగా వెతికాడు. గుండె ఎలా బయటికి తీయాలో కూడా సోషల్ మీడియా (Social Media) ద్వారానే నిందితుడు తెలుసుకున్నాడు. ఈ వీడియోలను చూసిన తర్వాతే నవీన్‌ను హత్యచేసి తల, గుండె (Heart), మర్మాంగాలను హరిహర వేరు చేశాడు’ అని దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అయితే.. ఒక మృతదేహానికి పోస్టుమార్టం చేయాలంటే ఒక్కరి వల్ల కాదు.. ఎంత నిపుణులుగా ఉన్నప్పటికీ కచ్చితంగా సహాయకులు కావాల్సిందే. అలాంటిది నవీన్ మృతదేహాన్ని హరిహర ఒక్కడే ఎలా చేశాడు..? ఇతనికి సహకరించిందెవరు..? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు.. హరిహర స్నేహితుడు (Hari Hara Friend) హసన్‌ను కూడా మరోసారి విచారణకు పిలిపించాలని పోలీసులు భావిస్తున్నారు.
మొత్తానికి చూస్తే.. నవీన్ కేసులో పాత్రధారులెవరు..? సూత్రదారులెవరు..? అని వీలైనంత త్వరగా తేల్చేయాలని రోజుకో కోణంలో పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్‌గా పోలీసులు ఏం తేలుస్తారో.. ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే మరి.