Medicines Cost: ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మెడిసిన్స్ ధరలు పెరగబోతున్నాయ్..!
ABN , First Publish Date - 2023-03-29T18:32:11+05:30 IST
ఏప్రిల్ 1వ తేదీ నుంచి సుమారు 27రకాల వ్యాధులకు ఉపయోగించే మందుల రేట్లు పెరగనున్నాయని.. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) సోమవారం పేర్కొంది. భారత ప్రభుత్వం అత్యవసర జాబితాలో చేర్చని మందుల ధరలు కూడా..
నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏడాదికేడాది ధరలు అంతకంత పెరగడమే కానీ తగ్గే ప్రసక్తే లేకుండా పోతోంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి ఈ తరుణంలో పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీ బయాటిక్స్ వరకు రోజూ వినియోగించే చాలా రకాల మందుల ధరలు పెరుగుతున్నాయనే వార్త.. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సుమారు 27రకాల వ్యాధులకు ఉపయోగించే మందుల రేట్లు పెరగనున్నాయని.. నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) సోమవారం పేర్కొంది. భారత ప్రభుత్వం అత్యవసర జాబితాలో చేర్చని మందుల ధరలు కూడా 10 శాతం పెరగనున్నాయని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్ 1నుంచి నిత్యవసర మందుల ధరలు (Medicines Prices) పది శాతం మేర పెరగనున్నాయి. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ -2013 ప్రకారం షెడ్యూల్డ్ ఔషధాల ధరలను టోకు ధరల సూచీకి అనుగుణంగా ఎన్‌పీపీఏ (National Pharmaceutical Pricing Authority) సవరిస్తూ ఉంటుంది. 27 రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల తయారీకి అవసరమైన 900 ఫార్ములేషన్లలో 384 అణువుల ధర 12 శాతం పెరగడమే దీనికి కారణం. వార్షిక హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) మార్పు ప్రకారం... డ్రగ్ కంపెనీలకు (Drug companies) ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
2022లో WPI ఇండెక్స్‌లో మార్పు 12.12 శాతానికి తగ్గిందని NPPA తెలిపింది. ఔషధ అణువులు ఖరీదైనవిగా మారడంతో నిత్యావసర మందుల ధరలను పెంచాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది. సాధారణంగా ఏప్రిల్ 1నుంచి ధరల్లో మార్పులు చేపడుతూ ఉంటారు. దీన్నిబట్టి గుండె జబ్బులు, యాంటీ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, మధుమేహం, విటమిన్లు, శ్వాసకోశ వ్యాధులు, నొప్పి, చర్మవ్యాధులు, మధుమేహం, స్త్రీల జననేంద్రియ, కంటి సంబంధిత వ్యాధుల చికిత్సకు సంబంధించిన మందుల ధరలు పెరగనున్నాయని తెలిసింది. ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసెటమాల్‌తో పాటూ ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, మెట్రోనిడజోల్, అజిత్రోమైసిన్ తదితర ఔషధాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!