Viral News: టమాటాల లారీని కొట్టేయడానికి ఈ జంట వేసిన ప్లాన్ మామూలుగా లేదుగా!..

ABN , First Publish Date - 2023-07-23T16:29:31+05:30 IST

దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో టమాటా ధరలు రూ.150 నుంచి రూ.200కు పైగా ఉన్నాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనడానికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో టమాటాల దోపిడీలు ఎక్కువైపోయాయి. రెండు వారాల క్రితం రైతు నుంచి టమాటాల లారీని దొంగిలించిన ఓ జంటను తాజాగా బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు.

Viral News: టమాటాల లారీని కొట్టేయడానికి ఈ జంట వేసిన ప్లాన్ మామూలుగా లేదుగా!..

బెంగళూరు: దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో టమాటా ధరలు రూ.150 నుంచి రూ.200కు పైగా ఉన్నాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనడానికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో టమాటాల దోపిడీలు ఎక్కువైపోయాయి. రెండు వారాల క్రితం రైతు నుంచి టమాటాల లారీని దొంగిలించిన ఓ జంటను తాజాగా బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. సదరు జంట దొంగిలించిన 2.5 టన్నుల టమాటాల లారీని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది ఈ ఘటన.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిరియూరుకు చెందిన రైతు మల్లేష్‌ తన పొలంలో టమాటాలు పండించాడు. 2.5 టన్నుల టమాటాలను లారీలో తీసుకుని ఈ నెల 8న కోలార్‌లో గల మార్కెట్‌కు బయలుదేరాడు. టమాటాల విలువ రూ.2.5 లక్షలకుపైగా ఉంటుంది. మల్లేషే స్వయంగా లారీ నడుపుకుంటూ వెళ్లాడు. తమిళనాడులోని వేలూరుకు చెందిన 28 ఏళ్ల భాస్కర్, 26 ఏళ్ల అతని భార్య సింధూజ చిక్కజాల వద్ద మల్లేష్ లారీని అడ్డుకున్నారు. అతని టమాటాల లారీ తమ కారును ఢీకొట్టిందని నాటకం ఆడారు. తమ కారుకు డ్యామేజ్ అయిందని నష్ట పరిహారంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు మల్లేష్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దంపతులిద్దరూ అతన్ని బెదిరించారు. ఆ దంపతులతోపాటు అక్కడికి మరో ముగ్గురు చేరుకున్నారు.

దంపతులిద్దరూ మరో ముగ్గురు కలిసి మల్లేష్‌ను కొట్టారు. అంతటితో ఆగకుండా మల్లేష్‌ను లారీ నుంచి బయటికి తోసేసి టమాటాల లారీని తీసుకెళ్లారు. అంటే మల్లేష్ లారీని వారు దొంగిలించారు. దీంతో మల్లేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసులు టమాటా లారీ కదలికలను ట్రాక్ చేసి అది ఎక్కడో ఉందో గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి టమాటాల లారీని స్వాధీనం చేసుకోవడంతోపాటు దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా భాస్కర్, సింధూజ దంపతులు రహాదారులపై దోపిడీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ నాటకం ఆడి టమాటాల లారీని దొంగిలించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-07-23T16:29:31+05:30 IST