Patna railway station: రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్లపై మూడు నిమిషాలపాటు.. ముఖం తిప్పేసుకున్న ప్రయాణికులు!
ABN , First Publish Date - 2023-03-20T10:51:05+05:30 IST
రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులందరూ ఉరుకుల పరుగుల మీద ఉన్నారు
పట్నా: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులందరూ ఉరుకుల పరుగుల మీద ఉన్నారు. తామెక్కాల్సిన రైలు వచ్చిందో? లేదో చూసుకుంటూ కొందరు, ప్లాట్‌ఫామ్ మీద కదిలేందుకు సిద్ధంగా ఉన్న రైలును అందుకునేందుకు కొందరు ఆదరాబాదరాగా పరుగులు తీస్తున్నారు. మరికొందరు మాత్రం తమ రైలు వచ్చేదెప్పుడో తెలియక ప్లాట్‌ఫామ్ పై ఉండే టీవీలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వారు ఊహించని ఘటన ఒకటి జరిగింది. అంతే.. అందరూ ఛీ..ఛీ అనుకుంటూ ముఖాలు తిప్పేసుకున్నారు. బీహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్(Patna Railway Station)లో జరిగిందీ ఘటన.
అప్పటి వరకు టీవీల్లో వస్తున్న ప్రకటనల స్థానంలో ఒక్కసారిగా పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమై టీవీలు ఆఫ్ చేయడమో, ఆ క్లిప్ ప్రసారం కాకుండా చూడడమో చేయాల్సిన రైల్వే సిబ్బంది మూడు నిమిషాలైనా దానిని పట్టించుకోలేదు. పెద్దలు, పిల్లలు, మహిళలతో రద్దీగా ఉన్న ఆ స్టేషన్‌లో అంతసేపు ఓ అడల్ట్ క్లిప్ ప్రసారమవుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. అప్పటికే ముఖాలు తిప్పేసుకున్న ప్రయాణికులు వెంటనే ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే భద్రతా దళం (RPF)కు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించాల్సిన జీఆర్‌పీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో రైల్వే స్టేషన్‌లోని టీవీల్లో ప్రకటన ప్రసారం చేసే దత్తా కమ్యూనికేషన్(Dutta Communication) దృష్టికి విషయం తీసుకెళ్లారు. వెంటనే ఆ వీడియో ప్రసారాన్ని ఆపాలని కోరారు. ఆ తర్వాత రైల్వే అధికారులు కూడా రంగంలోకి దిగారు. దత్తా కమ్యూనికేషన్‌పై కేసు నమోదు చేశారు. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతోపాటు జరిమానా కూడా విధించారు. ఆ సంస్థతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ పోర్న్ వీడియో పదో నంబరు ప్లాట్‌ఫామ్ పై ఉన్న టీవీల్లో మాత్రమే ప్లే కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.