Chennai: ఊరి పొలిమేరల్లో చనిపోయిన కొడుకు.. ఆత్మను మళ్లీ పిలిపించుకోవచ్చంటూ ఎవరో చెప్పడంతో..

ABN , First Publish Date - 2023-06-22T14:37:44+05:30 IST

హైటెక్‌ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.

Chennai: ఊరి పొలిమేరల్లో చనిపోయిన కొడుకు.. ఆత్మను మళ్లీ పిలిపించుకోవచ్చంటూ ఎవరో చెప్పడంతో..

ఆత్మకు ఆహ్వానం!

కుమారుని ఖననం చేసిన శ్మశానం నుంచి ఇంటి దాకా క్షుద్ర పూజలు

కలకలం రేపిన తల్లిదండ్రుల చర్య

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘటన

చెన్నై (ఆంధ్రజ్యోతి): హైటెక్‌ యుగంలోనూ మూఢ నమ్మకాలు జనాన్ని వెంటాడుతున్నాయి. కొడుకు భౌతికంగా దూరమైనా, అతని ఆత్మను ఇంటికి తెచ్చుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహా ఆ తల్లిదండ్రులను క్షుద్రపూజల వైపు దారి మళ్లించింది. దీంతో వీరు ఏకంగా శ్మశానం నుంచి ఇంటివరకూ పూజలు జరిపి ఆత్మను ఆహ్వానించిన తీరు కలకలం రేపింది.

తమిళనాడులోని తిరుత్తూరు జిల్లా సొరకాయలనత్తం గ్రామానికి చెందిన కేశవన్‌, వసంతి దంపతులకు ఎళిల్‌ అరసన్‌, ఉదయ్‌వసంత్‌ (20) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు నెలల క్రితం ఉదయ్‌వసంత్‌ ఆ ఊరి పొలిమేరల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేశారు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు దూరమయ్యేసరికి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉదయ్‌వసంత్‌ ఆత్మను మళ్లీ పిలిపించుకోవచ్చంటూ ఎవరో చెప్పడంతో క్షుద్ర మంత్రగాళ్లను ఆశ్రయించారు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబీకులతో కలిసి శ్మశానంలో క్షుద్రపూజలు నిర్వహించారు.

తొలిగా డప్పులు, ఢమరుకాలతో ఉదయ్‌ వసంత్‌ను ఖననం చేసిన ప్రాంతంలో పూజలు చేశారు. ఆ తర్వాత శ్మశానం నుంచి ఇంటి దాకా దారి పొడవునా పసుపుకుంకుమలు, పూలు చల్లుతూ, గాలిలోకి చేతులు ఊపుతూ ఆత్మకు స్వాగతం పలికారు. చివరగా ఇంట్లో ఏర్పాటు చేసిన ఉదయ్‌వసంత్‌ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు జరిపారు. తమ కుమారుడి ఆత్మ తమ ఇంటికి చేరుకుందని ఆ తల్లిదండ్రులు సంతృప్తి చెందారు. అల్లారుముద్దుగా పెంచిన కుమారుడి ఆత్మ కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనను చూసి కొందరు గ్రామస్తులు కంటతడిపెట్టుకోగా, మరికొందరు మాత్రం ఆ క్షుద్రపూజలకు భయపడి ఇళ్లలోనే ఉండిపోయారు.

Updated Date - 2023-06-22T14:37:47+05:30 IST