Viral News: ఎయిర్‌పోర్టులో కాదు.. ఇంటి టెర్రస్‌పై ల్యాండ్ అయిన విమానం.. అసలు ఏం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-07-24T21:20:12+05:30 IST
జార్జ్‌టౌన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. కానీ సదరు విమానం జార్జ్‌టౌన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఓ ఇంటి పై కప్పుపైకి(టెర్రస్) దూసుకెళ్లింది. దీంతో విమానం, ఇంటి పై కప్పు ధ్వంసమయ్యాయి.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో ఓ చిన్న విమానం ఇంటి పైకప్పును ఢీ కొట్టింది. ఆ సమయంలో విమానంలో పైలట్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే.. సింగిల్ ఇంజిన్ బీచ్ BE35 విమానంలో పైలట్, ఇద్దరు మహిళా ప్రయాణికులు ఉన్నారు. జార్జ్‌టౌన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. కానీ సదరు విమానం జార్జ్‌టౌన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఓ ఇంటి పై కప్పుపైకి(టెర్రస్) దూసుకెళ్లింది. దీంతో విమానం, ఇంటి పై కప్పు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న పైలట్, ఇద్దరి ప్రయణికులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ క్రాష్(NTSB) అధ్వర్యంలో విచారణ జరగనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకటించింది. జార్జ్‌టౌన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న నార్త్‌వుడ్ డ్రైవ్‌లోని 500 బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక విభాగం తెలిపింది. అయితే అదృష్టవశాత్తూ విమాన ప్రమాదం జరిగిన ఇల్లు ఖాళీగా ఉంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కెర్‌విల్లే నుంచి బయలుదేరిన విమానం 120 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో సమస్య రావడం వల్ల ఆకస్మాత్తుగా కిందికి వచ్చిన విమానం ఇంటి పై కప్పుపైకి దూసుకెళ్లిందని, దీంతో ఇంటి పైభాగం, విమానం ధ్సంసమయ్యాయని అధికారులు తెలిపారు. కాగా ధ్వంసమైన విమాన శకలాలను భారీ క్రేన్ల సాయంతో ఇంటి పై కప్పుపై నుంచి తొలగించారు. 'ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఉన్న ముగ్గురు భయపడ్డారు. గందరగోళంగా కనిపించారు. వారు పైకప్పులోని రంధ్రం నుంచి బయటికి దూకడానికి ప్రయత్నించారు. కానీ మేము వారిని ఇంటి బాల్కనీ నుంచి కిందికి తీసుకొచ్చాం. మెట్ల మార్గంలో వారు ఇంటి బయటికి వచ్చారు.' అని స్థానికులు తెలిపారు.