Viral Video: వామ్మో.. సమయానికి సపోర్ట్‌గా రాయి దొరికింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే గల్లంతేగా..!
ABN , First Publish Date - 2023-07-26T13:47:48+05:30 IST
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు యువకులు వరద నీటిలో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
Viral Video: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు యువకులు వరద నీటిలో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమయానికి సపోర్ట్‌గా ఓ రాయి దొరకడంతో వారు దానిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. చివరికి రెస్క్యూ సిబ్బంది అక్కడ చేరుకుని వారిని ఒడ్డుకు చేర్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారీ వర్షాల కారణంగా రాజస్థాన్ (Rajastan) రాష్ట్రవ్యాప్తంగా వరదలు పొటెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఉదయ్‌పూర్ (Udaipur) లోని మోర్వానియాలోని వంతెనపై మోటార్‌సైకిల్‌ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు యువకులు ఇరుక్కుపోయారు.
భారీ వరదలకు సమీపంలోని నది పొంగిపొర్లుతుండడంతో ఆ వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలోంచి ద్విచక్రవాహనంపై ఆ ఇద్దరు యువకులు వంతెన దాటేందుకు ప్రయత్నించారు. కానీ, కొంతదూరం వెళ్లాక ముందుకు వెళ్లలేకపోయారు. అప్పటికే వరదనీరు ప్రవాహం ఎక్కువైంది. వెంటనే వాహనంపై నుంచి దిగి, ఓ రాయిని పట్టుకుని అలాగే నిలబడిపోయారు. వారు అలా చేసి ఉండకపోతే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేవారని స్థానికులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ (Civil Defence) సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, చాలాసేపు శ్రమించి హైడ్రాలిక్ క్రేన్ సాయంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం వారి ద్విచక్రవాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.