OlaElectric: ఓలా ఈ-స్కూటర్లపై కొత్త ఫిర్యాదులు.. అంత డబ్బుపెట్టి కొంటే ఇదేం సమస్య?
ABN , First Publish Date - 2023-01-24T19:22:22+05:30 IST
భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ వాహనాలదేననే అంచనాల మధ్య విద్యుత్ వాహనరంగంలోకి (Electric vehicle sector) ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అడుగుపెట్టింది. ఈ-స్కూటర్లను (Electric Scooters) దేశీయంగా ఉత్పత్తి చేసి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామనడంతో కంపెనీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ...
భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ వాహనాలదేననే అంచనాల మధ్య విద్యుత్ వాహనరంగంలోకి (Electric vehicle sector) ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అడుగుపెట్టింది. ఈ-స్కూటర్లను (Electric Scooters) దేశీయంగా ఉత్పత్తి చేసి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామనడంతో కంపెనీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జనాలు కూడా అమితాసక్తిని కనబరిచారు. ఓలా ఎస్1 (Ola S1), ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air) ఆరంభ బుకింగ్స్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అంతటి అంచనాలతో మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్కూటర్లకు తలెత్తుతున్న సమస్యలు హడలెత్తిస్తున్నాయి. స్కూటర్లలో మంటలు చెలరేగుతున్న వరుస ఘటనలు మరచిపోక ముందే తాజాగా మరో కొత్త సమస్య యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ-స్కూటర్ ‘ఫ్రంట్ సస్పెన్షన్’కు (front suspension) సంబంధించి వరుసగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
ఇటివల ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై సోషల్ ఛేంజ్ ప్లాట‌్‌ఫామ్ ‘ఛేంజ్.వోఆర్జీ ఇండియా’ ట్విటర్ వేదికగా స్పందించింది. @SamkitP21 అనే ట్విటర్ యూజర్ ట్వీట్‌ను షేర్ చేసింది. కాగా ‘‘ స్కూటర్ ముందు చక్రం సస్పెన్షన్ బ్రేకింగ్ ఔట్ కారణంగా నా భార్య నడుపుతున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం గాయాలతో బాధపడుతోంది’’ అని సాంకిత్ పేర్కొన్నాడు. ‘పరీక్షించని కదిలే శవపేటిక’ అని సాంకిత్ అని వర్ణించాడు. సౌమో బక్షీ అనే ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. తన కూతురికీ ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపాడు. తన కూతురు ప్రయాణిస్తున్న ఓలా ఎస్1 స్కూటర్ ప్రమాదానికి గురైందని, గాయాలతో బాధపడుతోందని చెప్పాడు. మరో నెటిజన్ స్పందిస్తూ... ఓలా స్కూటర్లు అన్నింటినీ రీకాల్ చేయాలని పిలుపునిచ్చాడు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో భయాలకు కారణమవుతున్నాయని హనుమాన్ చౌదరీ అనే ట్విటర్ యూజర్ పేర్కొన్నాడు. నాణ్యతతో తయారు చేశామని ఓలా కంపెనీ చెప్పినప్పటికీ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పాడు. సాధారణ రోడ్లపైనే స్కూటర్ల పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రస్తావించాడు.
ఇలాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని ఛేంజ్.వోఆర్జీ ఇండియా పేర్కొంది. గతేడాది ఓలాఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్లలో మంటలు చెలరేగిన ఘటనల తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ సమస్యలు కొనుగోలుదారులకు ఆందోళనకరంగా మారాయని పేర్కొంది. ఫిర్యాదుల నేపథ్యంలో.. భద్రత పరీక్షలకు సంబంధించిన ఓలా స్కూటర్ క్రాష్ టెస్ట్ వీడియోను విడుదల చేయాలని ఛేంజ్.వోఆర్జీ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓలాఎలక్ట్రిక్, భవిష్ అగర్వాల్‌ను డిమాండ్ చేస్తూ ఒక పిటిషన్‌ను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో కూడా తెలపాలని కంపెనీని డిమాండ్ చేసింది.