UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

ABN , First Publish Date - 2023-08-07T15:37:54+05:30 IST

ఒకప్పుడు లేఖల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనామకులుగా పరిచయం అవ్వడం, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడటం వంటివి జరిగిపోతున్నాయి..

UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

ఒకప్పుడు లేఖల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనామకులుగా పరిచయం అవ్వడం, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడటం వంటివి జరిగిపోతున్నాయి. ఈ తరంలోని చాలా ప్రేమకథలకి ఈ సోషల్ మీడియానే పునాది వేసిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. తాజాగా ఓ యువ జంట కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నారు. రెగ్యులర్‌గా చాటింగ్ చేయడంతో, మనసులు కలిశాయి. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలో యువతి కిడ్నాప్‌కు గురైంది. తండ్రికి ఒక వీడియో కూడా వచ్చింది. ఆయన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగాక.. దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పదండి.. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం...


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన హన్సికా వర్మ అనే యువతి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పాస్ అయ్యింది. అడ్మిషన్ కోసం రూర్కీలోని ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతోంది. కానీ.. ఇంతలోనే ఆ యువతి ఒక్కసారిగా మాయమైపోయింది. తమ అమ్మాయి కనిపించకపోవడంతో.. పేరెంట్స్ ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ, ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలోనే హన్సిక తండ్రి వాట్సాప్‌కు ఒక వీడియో మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగా.. అందులో హన్సిక తాళ్లతో బందీగా కనిపించింది. దీంతో.. ఆమె తండ్రి భయాందోళనలకు గురయ్యారు. కొద్దిసేపు తర్వాత హన్సిక తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం. ఆమె ప్రాణాలతో ఉండాలంటే, రూ.10 లక్షలు సిద్ధం చేసుకో’’ అని కిడ్నాపర్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని కూడా ఆ కిడ్నాపర్ బెదిరించాడు.

అయితే.. భయభ్రాంతులకు గురైన హన్సిక తండ్రికి ఏం చేయాలో పాలుపోక, పోలీసుల్ని సంప్రదించారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి, తనకొచ్చిన వీడియోని పోలీసులకు చూపించారు. తక్షణమే పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వెంటనే కిడ్నాప్ మిస్టరీని ఛేధించారు. అప్పుడే అసలు ట్విస్ట్ వెలుగుచూసింది. ఇదంతా ఒక ఫేక్ కిడ్నాప్ అని, హన్సికనే ఈ డ్రామాకు తెరతీసిందని పోలీసుల విచారణలో తేలింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రాజ్ అనే యువకుడితో పెళ్లి చేసుకోవడం కోసం ఈ నాటకం ఆడిందని వెల్లడైంది. పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి డబ్బులు లేకపోవడంతో.. హన్సిక, రాజ్ కలిసి ఈ ఫేక్‌ కిడ్నాపింగ్‌కు ప్లాన్‌ చేశారు. వీరికి పెళ్లైనట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా లభ్యమైంది కానీ.. అది నిజమో, కాదో తేల్చే పనిలో ఉన్నారు.

Updated Date - 2023-08-07T15:37:54+05:30 IST