Viral Video: బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నందుకే కాదండోయ్.. ఈ మహిళపై నెట్టింట ప్రశంసల వర్షం కురవడం వెనుక అసలు కారణమిదీ..!
ABN , First Publish Date - 2023-10-27T13:59:55+05:30 IST
మహిళలూ బస్సు నడపగలుగుతారు.. కానీ ఈ మహిళ మాత్రం ప్రత్యేకం..
ఆడవారి గురించి ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మహిళల శక్తి ఎంతటిదో వారు సాధించిన విజయాల్లోనే స్పష్టం అవుతుంది. వంటింటి కుందేళ్ల నుండి అంతరిక్షంలో అడుగు పెట్టడం వరకు, గృహిణి గానే కాకుండా పురుషులతో సమానంగా వారు రాణించే అన్ని రంగాలలో మహిళలు సత్తా చాటుతుంటారు. పురుషులే చెయ్యగలరు అనుకున్న కొన్ని వృత్తులలో సమర్థవంతంగా రాణించే మహిళలలను చూస్తే నిజంగా గుండె ఉప్పొంగుతుంది. భారీ వాహనాలు నడపడం అనేది చాలావరకు మగవారే చెయ్యగలరు అనే అపోహను కూడా మహిళలు తుడిచిపెట్టేశారు. ఓ మహిళ బస్సు డ్రైవ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రశంసలన్నీ ఆమె బస్సు డ్రైవ్ చేస్తున్నందుకు కాదు, దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
మహిళలు(Women's) మగవారికంటే శారీరకంగా సున్నితంగా ఉండొచ్చు. కానీ మానసికంగా మాత్రం వారు చాలా బలవంతులు. ఏదైనా సాధించి తీరతారు. మహారాష్ట్రకు(Maharashtra) చెందిన మీనా కూడా అలాంటి దృఢమైన మహిళే.. మహారాష్ట్ర రాష్ట్రలో మీనా అనే బస్సు డ్రైవర్(bus driver Meena) ఉంది. ఈమె మహారాష్ట్ర రోడ్లపై బస్సును వేగంగా పరుగులు తీయిస్తూ మగవారు ఆధిపత్యం చలాయించే హెవీ వెహికల్ డ్రైవింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీడియోలో మీనా బస్సు నడుపుతుండటం చూడవచ్చు. ఇందులో ఆమె పసుపు రంగు చీర కట్టుకుని కుడిచేతినిండుగా గాజులు వేసుకుని, మరొకచేతికి వాచి కట్టుకుంది. ఎంతో సంతోషంగా చిరునవ్వుతో బస్సు డ్రైవ్ చేస్తోంది. సాధారణంగా వృత్తిని బట్టి చాలామంది వస్త్రాధారణ మారుస్తుంటారు. కానీ మీనా మాత్రం భారతీయ మహిళ గౌరవాన్ని రెట్టింపు చేసే చీరకట్టును వదులుకోలేదు. చక్కగా చీరకట్టులోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బస్సు నడుపుతోంది(bus driving in saree). బస్సు నడుపుతున్న సమయంలో ఆమె చిరునవ్వు చూస్తే ఆమె ఆ వృత్తిని ఎంత ఇష్టంగా కొనసాగిస్తోందో అర్థమవుతుంది. మీనా బస్సు నడుపుతున్న ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. అన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలకొద్దీ కామెంట్స్, లైక్స్ చేయబడ్డాయి.
Viral Video: ఓరి దేవుడో.. దీన్ని ఎలా తింటున్నార్రా నాయనా..? ఇడ్లీలతో ఇలాంటి ప్రయోగాలేంటి..?
మీనా బస్సు నడుపుతున్న వీడియోను landgemina అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'భారతీయ మహిళలు అందరికంటే బలంగా ఉన్నారు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ అమ్మవారి దయ ఎప్పుడూ నీతోనే ఉంటుంది సిస్టర్' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'మీ ధైర్యానికి సెల్యూట్ సిస్టర్, మీ డ్రైవింగ్ లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనబడుతోంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'అంతా బాగుంది కానీ మీ రక్షణ కోసం సీటు బెల్టు ఉపయోగించండి సిస్టర్' అని మరొకరు అన్నారు.