Ashwin: విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓడిన యువ భారత్‌కు అశ్విన్ మద్దతు.. ఏం అన్నాడంటే..?
ABN , First Publish Date - 2023-08-15T17:21:04+05:30 IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు. టీ20 సిరీస్‌లో ఓడినప్పటికీ భారత్‌కు చాలా సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లు విండీస్ పర్యటన నుంచి చాలా నేర్చుకున్నారని, వారికి మంచి అనుభవం లభిచిందని అన్నాడు. వెస్టిండీస్‌లో యువ ఆటగాళ్లు మంచి ఫామ్‌ను పొందుతారని తెలిపాడు.
"ఈ టీ20 సిరీస్‌లో మనకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించని జట్టుతో ఓడినందున సోషల్ మీడియాలో జట్టును విమర్శించడం చాలా సులభం. కరేబియన్ జట్టు రాబోయే వన్డే ప్రపంచకప్‌నకు కూడా అర్హత సాధించలేదు. అయితే నేను మీకు కొంత సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను. నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. యువ ఆటగాడిగా వెస్టిండీస్‌కు వెళితే అక్కడ కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అన్ని దేశాలలో కొన్ని సహజ రహస్యాలు ఉంటాయి. స్థానిక ఆటగాళ్లను కలవడం ద్వారా మన ఆటగాళ్లకు ఈ విషయాలు ఎక్కువగా తెలుస్తాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు రకరకాల విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. క్రికెటర్‌గా నాకు ఇవే మొదటి అనుభవాలు. ప్రస్తుత టీమిండియా యువ ఆటగాళ్లు కూడా విండీస్ పర్యటన నుంచి చాలా నేర్చుకున్నారు. వారు ఖచ్చితంగా ఇక్కడ మంచి అనుభవాన్ని పొందుతారు.’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
కాగా వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమిపాలైంది. సిరీస్‌ను 2-3తో కోల్పోయింది. ఈ ఓటమితో ఇటు ఆటగాళ్లపై, అటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమర్శలపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. కాగా వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కు ప్రస్తుతం పరిమిత టీమిండియా వన్డే, టీ20 జట్టులో చోటులేదు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.