Asia cup 2023: నేపాల్ ఆటగాళ్లకు టీమిండియా సర్‌ప్రైజ్.. ప్రత్యేకంగా అభినందించిన కోహ్లీ, హార్దిక్

ABN , First Publish Date - 2023-09-05T18:37:57+05:30 IST

ఆసియా కప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌పై టీమిండియా సునాయసంగా గెలిచింది. వర్షం కలవరపెట్టినప్పటికీ లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Asia cup 2023: నేపాల్ ఆటగాళ్లకు టీమిండియా సర్‌ప్రైజ్.. ప్రత్యేకంగా అభినందించిన కోహ్లీ, హార్దిక్

ఆసియా కప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌పై టీమిండియా సునాయసంగా గెలిచింది. వర్షం కలవరపెట్టినప్పటికీ లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం నేపాల్ ఆటగాళ్లకు టీమిండియా ఆటగాళ్లు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నేపాల్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. వారి విలువైన సూచనలను నేపాల్ ఆటగాళ్లకు ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లతో నేపాల్ క్రికెటర్లు సెల్ఫీలు కూడా దిగారు. అనంతరం మ్యాచ్‌లో రాణించిన నేపాల్ ఆటగాళ్లను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మెడల్స్‌తో ప్రత్యేకంగా అభినందించారు. నేపాల్ స్కోర్ 200 దాటడంలో కీలకపాత్ర పోషించిన మిడిలార్డర్ బ్యాటర్ సోంపాల్ కామినిని హార్దిక్ పాండ్యా మెడల్‌తో సత్కరించాడు. మెడల్ అతని మెడలో వేసి అభినందించాడు. అలాగే హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఆసిఫ్ షేక్‌ను అభినందించి కోహ్లీ మెడల్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు బౌలింగ్‌లో తేలిపోయినప్పటికీ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ రాణించడంతో నేపాల్ స్కోర్ 230కి చేరుకుంది. అనంతరం వర్షం కారణంగా అంపైర్లు భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 నిర్ణయించారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వికెట్ పడకుండా భారత్‌కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఆసియాకప్‌లో టీమిండియా సూపర్ 4లో అడుగుపెట్టింది.

Updated Date - 2023-09-05T18:37:57+05:30 IST