Share News

Hardik Pandya: హార్దిక్ గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన జైషా.. జట్టులో చేరేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-12-10T11:57:03+05:30 IST

గాయం కారణంగా కొన్ని రోజులుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా గురించి బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన హార్దిక్ పాండ్యా నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడని చెప్పాడు.

Hardik Pandya: హార్దిక్ గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చిన జైషా.. జట్టులో చేరేది ఎప్పుడంటే..

గాయం కారణంగా కొన్ని రోజులుగా టీమిండియాకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా గురించి బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన హార్దిక్ పాండ్యా నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడని చెప్పాడు. ఫిట్‌నెస్ సాధించడానికి చాలా కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ‘‘మేము దీనిని రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఎన్సీఏలో ఉన్నాడు. అతను చాలా కష్టపడుతున్నాడు. హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాక మీకు తెలియచేస్తాం. అప్ఘానిస్థాన్‌తో సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటాడు.’’ అని షా చెప్పాడు. కాగా భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా మిగతా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, ఆదివారం నుంచి ప్రారంభంకానున్న సౌతాఫ్రికా పర్యటనకు కూడా హార్దిక్ దూరమయ్యాడు.


అదే విధంగా టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పొడిగింపు గురించి జైషా మాట్లాడాడు. నిజానికి టీమిండియా ప్రధాన్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. కానీ ద్రావిడ్ పని తీరు పట్ల బీసీసీఐ సంతృప్తితో ఉంది. దీంతో అతని పదవీ కాలాన్ని మరింత కాలం పొడిగించాలని నిర్ణయించింది. మాజీ క్రికెటర్ల నుంచి కూడా ఇవే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. దీంతో ద్రావిడ్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం అయితే తీసుకుంది కానీ ఇంకా ఖరారు చేయలేదు. ద్రావిడ్ ఎంత కాలం ఉంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ విషయమై జైషా మాట్లాడుతూ ‘‘మేము పొడిగించాం కానీ ఒప్పందాన్ని ఇంకా ఖరారు చేయలేదు. దీన్ని గురించే మాట్లాడేందుకు మాకు అసలు సమయం లభించలేదు. ప్రపంచకప్ ముగిశాక నేను ద్రావిడ్‌తో సమావేశమయ్యాను. ద్రావిడ్ కొనసాగింపునకు పరస్పరం అంగీకరించాం. అయితే ద్రావిడ్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక మేము కూర్చుని నిర్ణయం తీసుకుంటాం.’’ అని తెలిపాడు. కాబట్టి సౌతాఫ్రికా టూర్ ముగిశాక ద్రావిడ్ ఎంత కాలం టీమిండియా కోచ్‌గా కొనసాగుతాడనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-12-10T11:57:05+05:30 IST