Virat kohli: విరాట్ కోహ్లీ ఉజ్జయినీ ఆలయాన్ని సందర్శించడంతో ఈసారి కూడా అలా జరుగుతుందా?..
ABN , First Publish Date - 2023-03-07T20:09:35+05:30 IST
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి. కోహ్లీ చివరిగా టెస్టు సెంచరీ కొట్టింది 2019 నవంబరు 22న. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్కసెంచరీ కూడా లేదు...
దాదాపు మూడున్నరేళ్లు అవుతోంది.. మధ్యలో ఎన్నో పరిణామాలు.. పదుల సంఖ్యలో మ్యాచ్‌లు.. కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు.. ఎన్నడూ లేనంతగా విరామం సైతం తీసుకున్నాడు.. తిరిగొచ్చాక టీ20ల్లో ఒకటి (తొలి), వన్డేల్లో రెండు సెంచరీలు బాదాడు. కానీ, అసలు సిసలు క్రికెట్ అయిన టెస్టు సమరంలోకి వచ్చేసరికి పూర్తిగా తేలిపోతున్నాడు. కనీసం అర్ధ సెంచరీ సాధించినా చాలు అన్నంతగా వెనుకబడిపోతున్నాడు. విదేశంలో అయితే వైఫల్యం కాస్త సహజం అని సర్దిచెప్పుకోవచ్చు.. స్వదేశంలోనూ మూడంకెల స్కోరును అందుకోలేకపోతున్నాడు. ఇదంతా ఎవరి గురించో మీకు తెలిసిపోయి ఉంటుందనుకుంటా..?
అప్పటికి అదే ఆఖరు
పైన చెప్పుకొన్న ఉపోద్ఘాతమంతా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి. కోహ్లీ చివరిగా టెస్టు సెంచరీ కొట్టింది 2019 నవంబరు 22న. అది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో (Eden Gardens) బంగ్లాదేశ్‌పై (Bangladesh) జరిగిన గులాబీ టెస్టులో (Pinkball test). బ్యాట్స్‌మన్‌కు పరీక్ష పెట్టే గులాబీ బంతితో జరిగిన నాటి టెస్టులో కెప్టెన్‌గా కోహ్లి 139 పరుగులు (Kohli century) సాధించాడు. ఇక అంతే.. మళ్లీ ఇప్పటివరకు సంప్రదాయ ఫార్మాట్‌లో.. తెల్ల దుస్తుల్లో.. అతడు హెల్మెట్ తీసి అభివాదం చేసింది లేదు. కాగా, 2020 ప్రారంభంలోనే కొవిడ్ ప్రభావంతో క్రికెట్ మ్యాచ్‌లకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఆ వ్యవధిని ఓ గరిష్ఠంగా ఓ ఏడాది కింద తీసివేసినా.. కోహ్లి టెస్టు సెంచరీ చేయక రెండున్నరేళ్లు అవుతోంది అనుకోవచ్చు.
ఏవీ నాటి మెరుపులు..?
1& 19 (నాటౌట్), 24 & 1, 12, 44 & 20, 22 & 13.. ఇవీ గత ఐదు టెస్టుల్లో కోహ్లి చేసిన పరుగులు. 8 ఇన్నింగ్స్‌లో ఒక్కటంటే ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. అంతెందుకు..? ఆస్ట్రేలియాతో (IndiaVsAustralia) ఆడిన మూడు టెస్టుల్లో కోహ్లి చేసిన పరుగులు కేవలం 113. టెస్టుల్లో కోహ్లి ఎంతగా తేలిపోతున్నాడో చెప్పే గణాంకాలివి. 11&20, 23&13, 45, 79& 29, 35 & 18.. ఇవన్నీ ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాపై చేసిన పరుగులు. మొత్తంమ్మీద చూస్తే గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో కోహ్లి నుంచి కనీసం అర్ధ సెంచరీ కూడా లేదు. ఇందులో రెండుసార్లే అతడు 40కిపైగా పరుగులు చేశాడు. మరీ విచిత్రం ఏమిటంటే గత 14 నెలల్లో టెస్టు క్రికెట్‌లో అతడు వందకు మించి బంతులను ఎదుర్కొన్నది రెండు సందర్భాల్లోనే.
ఏకాగ్రత లోపంతో స్పిన్‌కు తలవంచుతూ..
ఒకప్పుడు కోహ్లి అత్యుత్తమ బౌలర్ వేసే (spin bowling) అత్యుత్తమ బంతికి ఔటయ్యేవాడు. కానీ, ఇప్పుడు సాధారణ బౌలర్ సాధారణ బంతికీ వికెట్ ఇచ్చేస్తున్నాడు. సహజంగా ఉప ఖండ జట్ల బ్యాట్స్‌మెన్ మరీ ముఖ్యంగా కోహ్లి స్థాయి లాంటి వారు ఎలాంటి స్పిన్ బౌలింగ్‌నైనా దీటుగా ఎదుర్కొనగలరు. కానీ, బ్యాడ్‌లక్ ఏమిటంటే కోహ్లి స్పిన్‌కే తలవంచుతున్నాడు. మంచి ప్రారంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో అతడికి స్పిన్ గండం ఎదురవుతోంది. చివరి ఐదు టెస్టుల్లో ఏడుసార్లు విరాట్ తన వికెట్‌ను స్పిన్నర్లకే ఇచ్చేశాడు. దీనంతటికీ కారణం.. అతడు స్పిన్ పరీక్షను తట్టుకుని నిలబడలేకపోవడమే. ఈ క్రమంలో ‘‘ఏకాగ్రత లోపం’’ పెద్ద శాపంగా మారుతోంది.
ముప్పు పొంచి ఉన్నట్లే..?
గత రెండేళ్లలో టీమిండియా టెస్టు బ్యాట్స్‌మెన్‌లో ముఖ్యులు అనుకున్న ముగ్గురిపై వేటు పడింది. వారు.. అజింక్య రహానే (Rahane), కేఎల్ రాహుల్ (kL Rahul), చతేశ్వర్ పుజారా (Cheteswar Pujara). విశేషం ఏమంటే రహానే, రాహుల్ ఇద్దరూ వైస్ కెప్టెన్లుగానూ వ్యవహరించారు. పుజారా కూడా తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టాడు. వాస్తవానికి రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన జట్టుకు రహానే సారథి. అయినా పేలవ ఫామ్‌తో వేటుకు గురయ్యాడు. ది గ్రేట్ వాల్ పుజారా కూడా వేటు బారినపడి మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇక రాహుల్ టెస్టు కెరీర్ డోలాయమానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి విఫలమైన అతడిని మూడో టెస్టుకు పక్కనపెట్టారు. ఈ క్రమంలో మిగిలింది విరాట్ కోహ్లినే. దిగ్గజ బ్యాట్స్‌మన్ కాబట్టి అతడికి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. లేదంటే ఈపాటికి పక్కకు తప్పించేవారే?.
అక్కడి జోరు ఇక్కడేది?
గత ఏడాది సెప్టెంబరు ముందు వరకు ఫామ్ లేమి ఎదుర్కొన్న కోహ్లి.. విరామం తీసుకుని వచ్చీ రాగానే టి20ల్లో తొలి శతకం బాదాడు. అదే జోరులో ప్రపంచ కప్‌లోనూ రాణించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్, శ్రీలంకపై సెంచరీలు కొట్టాడు. కానీ తనకెంతో ఇష్టమైన టెస్టులకు వచ్చేసరికి విఫలమవుతున్నాడు. దీన్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. కాగా, పరిస్థితులను బట్టి చూస్తుంటే భవిష్యత్‌లో కోహ్లిని టీ20 జట్టులోకి పరిగణించకపోవచ్చు. కాబట్టి అతడికి టెస్టులపై ఫోకస్ పెట్టేందుకు మంచి అవకాశం.
కోహ్లిని ఆ మహాకాలుడు కరుణిస్తాడా..?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మూడో టెస్టు (Indore test) ముగిశాక భార్య అనుష్క శర్మతో (Anushka Sharma) కలిసి ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని (Ujjain Temple) సందర్శించాడు. విశిష్టమైన ‘భస్మ హారతి’లో పాల్గొన్నాడు. చిత్రమేమంటే.. వీరు ఇంతకుముందు రిషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని, బృందావనంలోని బాబా నీమ్ కరోలీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత కోహ్లి శ్రీలంకపై సెంచరీ నమోదు చేశాడు. ఉజ్జయినీ ఆలయ సందర్శన అనంతరం కూడా.. నాలుగో టెస్టులో అతడు శతకం చేస్తాడని అనుకోవచ్చా?. వేచిచూడాల్సిందే మరి.