WPL 2023: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఆర్సీబీ.. స్మృతి మంధానపై అసభ్య కామెంట్లు

ABN , First Publish Date - 2023-03-11T16:31:25+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)

WPL 2023: వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన ఆర్సీబీ.. స్మృతి మంధానపై అసభ్య కామెంట్లు

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. శుక్రవారం రాత్రి యూపీ వారియర్స్‌(UP Warriorz)తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ దెబ్బతో ఆ జట్టుపై ట్రోల్స్ మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)పై అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అసభ్యకర కామెంట్లు చేస్తూ జట్టు ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ లీగ్‌లో స్మృతి కూడా పెద్దగా రాణించింది లేదు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో చేసిన 35 పరుగులే అత్యధికం. దీంతో ఆర్సీబీ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్మృతిపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. రాయలేని భాషలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచుల్లోనూ మంధాన జట్టు దారుణ పరాజయాల్ని ఎదుర్కొంది. ఫలితంగా ఇప్పటి వరకు ఖాతా తెరవలేక పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడనుంది.

అభిమానుల కామెంట్లలో కొన్ని..

* డబ్ల్యూపీఎల్ చూడడం టైమ్ వేస్ట్. టాప్ ప్లేయర్లు కూడా ఆడడం లేదు. ఆర్సీబీ అభిమానిగా చాలా బాధగా ఉంది

* డబ్ల్యూపీఎల్ బిగ్గెస్ట్ ఫ్రాడ్. టైమ్ వేస్ట్

* అసలు వీళ్లకు ఆడడం వచ్చా లేదా? ఇదేం క్రికెట్? ఈ జట్టుకు మళ్లీ సానియా మీర్జా మెంటార్

* దరిద్రమైన కెప్టెన్సీ

* ఎల్లిస్ పెర్రీకి కెప్టెన్సీ ఇవ్వండి ప్లీజ్

* మంధానాకు రూ. 3.4 కోట్లు వేస్ట్

* వెంటనే కెప్టెన్‌ను మార్చండి

* రూ. 3.4 కోట్లు వృథా అయ్యాయి

* మంధాన ప్లీజ్.. కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఎల్లిస్‌కు ఇచ్చెయ్

smriti.jpg

Updated Date - 2023-03-11T16:31:25+05:30 IST