PAK Vs AFG: ప్రపంచకప్‌లో మూడో సంచలనం.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్
ABN , First Publish Date - 2023-10-23T22:17:30+05:30 IST
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన ఆప్ఘనిస్తాన్.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్‌కు కూడా తన దెబ్బను రుచి చూపించింది. సోమవారం నాడు చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది.
ఇండియా గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన ఆప్ఘనిస్తాన్.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్‌కు కూడా తన దెబ్బను రుచి చూపించింది. సోమవారం నాడు చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ ఈ స్కోరు ఛేదించలేదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆప్ఘనిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్లు గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87) హాఫ్ సెంచరీలతో మంచి పునాది వేశారు. గుర్భాజ్ అవుటైనా రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (48 నాటౌట్) తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు.
కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆప్ఘనిస్తాన్‌కు ఇది మూడో విజయం. 2015లో స్కాట్లాండ్‌పై గెలిచిన ఆప్ఘనిస్తాన్.. తమ రెండో విజయాన్ని ఈ ప్రపంచకప్‌లోనే సాధించింది. గత ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్‌ను ఓడించి ఔరా కనిపించింది. ఇప్పుడు ఏకంగా బలమైన బౌలింగ్ దళం ఉన్న పాకిస్థాన్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్‌కు ఇది తొలి విజయం కావడం గమనించాల్సిన విషయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆప్ఘనిస్తాన్ ఆరో స్థానానికి చేరింది. అటు పాకిస్థాన్ ఐదో స్థానానికి పడిపోయింది. పాపం పాకిస్థాన్‌కు అక్టోబర్ 23 మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. గత ఏడాది ఇదే రోజు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై ఓటమి పాలైన పాకిస్థాన్ ఈ ఏడాది ఆప్ఘనిస్తాన్ లాంటి పసికూనపై ఓడి అభాసుపాలైంది.