KL Rahul: కేఎల్ రాహుల్‌కు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. మిగతా రెండు టెస్టులకు..

ABN , First Publish Date - 2023-02-19T20:57:14+05:30 IST

టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌(KL Rahul)కు బీసీసీఐ గట్టి షాకిచ్చింది. గతేడాది కాలంగా ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న రాహుల్‌ను

 KL Rahul: కేఎల్ రాహుల్‌కు గట్టి షాకిచ్చిన బీసీసీఐ.. మిగతా రెండు టెస్టులకు..

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌(KL Rahul)కు బీసీసీఐ గట్టి షాకిచ్చింది. గతేడాది కాలంగా ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న రాహుల్‌ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. 2021లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా నాయకత్వ గ్రూప్‌లో భాగస్వామి అయిన రాహుల్ శ్రీలంక(Sri Lanka)తో సిరీస్‌లో శాశ్వతంగా వైస్ కెప్టెన్‌గా మారాడు. దక్షిణాఫ్రికాతో ఒక టెస్టు మ్యాచ్, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. అయినప్పటికీ ఫామ్‌లో మాత్రం తేడా కనిపించలేదు. అయినప్పటికీ జట్టులో అతడిని ఇంకా కొనసాగిస్తుండడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అయితే జట్టు నుంచి మాత్రం ఉద్వాసన పలకలేదు.

ఆస్ట్రేలియా(Australia)తో చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ(BCCI) ఆశ్చర్యకరంగా ఎవరినీ వైస్ కెప్టెన్‌గా ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో చతేశ్వర్ పుజారా(Pujara) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయినప్పటికీ ఈసారి ఎవరినీ ప్రకటించకుండా ఆశ్చర్యపరిచింది. జట్టు నాయకత్వ బృందంలో భాగమైన తర్వాత రాహుల్ 7 టెస్టుల్లో 175 పరుగులు మాత్రమే చేశాడు.

2022 నుంచి ఒక్కసారి మాత్రమే 50కిపైగా పరుగులు చేశాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రాహుల్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకున్నా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. టీ20 ప్రపంచ తర్వాత అతడు దాదాపు ప్రతి టీ20 మ్యాచ్‌కు సారథ్యం వహించాడు. ఇక, చివరి రెండు టెస్టుల్లో రాహుల్‌కు కనుక తుది జట్టులో చోటు లభిస్తే శుభమన్ గిల్ ‌బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.

Updated Date - 2023-02-19T20:57:22+05:30 IST