Virat Kohli: కోహ్లీ కెరీర్‌లో 500వ మ్యాచ్.. బీసీసీఐ స్పెషల్ ట్వీట్

ABN , First Publish Date - 2023-07-20T14:15:17+05:30 IST

విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించబోతున్నాడు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి అతడు 500వ మ్యాచ్ ఆడబోతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 500వ మ్యాచ్ ఆడనున్న సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. కోహ్లీ గురించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరిస్తున్న వీడియోను షేర్ చేసింది.

Virat Kohli: కోహ్లీ కెరీర్‌లో 500వ మ్యాచ్.. బీసీసీఐ స్పెషల్ ట్వీట్

టీమిండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. టీమిండియాలో ఫిట్‌నెస్‌తో కనిపించే ఏకైక క్రికెటర్ కోహ్లీనే అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించబోతున్నాడు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి అతడు 500వ మ్యాచ్ (500 Match) ఆడబోతున్నాడు. వెస్టిండీస్‌తో గురువారం నుంచి జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో కోహ్లీ ఈ ఘనత సాధించనున్నాడు. 500 మ్యాచ్‌లలో 111 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఉన్నాయి.

అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 500వ మ్యాచ్ ఆడనున్న సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. కోహ్లీ గురించి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరిస్తున్న వీడియోను షేర్ చేసింది. తాను ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని కోహ్లీ అన్నాడు. తనకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆకాంక్షించాడు. అటు కోహ్లీ 500వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా జీవితంలో ఇదో ప్రత్యేక సందర్భం అని.. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ఘనతలు సాధిస్తారని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. కోహ్లీ అంకిత భావం, పట్టుదలే అతడు ఈ గణాంకాలకు చేరుకోవడం నిదర్శనమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. క్రికెట్ అనే బ్రాండ్‌కు కోహ్లీ అంబాసిడర్ అని.. అతడి సేవలకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. అటు అంతర్జాతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌లు ఆడటం అంటే సాధారణ విషయం కాదని.. అందులోనూ 75 సెంచరీలు చేయడం ఎంతో ప్రత్యేకమని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు.


కాగా విరాట్ కోహ్లీ కంటే ముందు అంతర్జాతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన వాళ్లు మొత్తం 9 మంది ఉన్నారు. అందులో ముగ్గురు భారత క్రికెటర్లు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ జాబితాలో సచిన్ (664 మ్యాచ్‌లు), జయవర్ధనే (652 మ్యాచ్‌లు), సంగక్కర (594 మ్యాచ్‌లు), జయసూర్య (586 మ్యాచ్‌లు), రికీ పాంటింగ్ (560 మ్యాచ్‌లు), ధోనీ (538 మ్యాచ్‌లు), షాహిద్ అఫ్రిది (524 మ్యాచ్‌లు), కలిస్ (519 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్ (509 మ్యాచ్‌లు) ఉన్నారు.

ఇది కూడా చదవండి: Sunrisers Hyderabad: హెడ్ కోచ్ లారాపై వేటు.. కావ్య పాప సంచలన నిర్ణయం

Updated Date - 2023-07-20T14:15:17+05:30 IST