Asia Cup 2023: నేపాల్‌కు బీర్ కంపెనీ బంపర్ ఆఫర్.. టీమిండియాపై రెచ్చిపోతారా?

ABN , First Publish Date - 2023-09-04T15:03:04+05:30 IST

ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ నజరానా ప్రకటించింది.

Asia Cup 2023: నేపాల్‌కు బీర్ కంపెనీ బంపర్ ఆఫర్.. టీమిండియాపై రెచ్చిపోతారా?

ఆసియా కప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. సూపర్-4లో అడుగుపెట్టాలంటే ఈరోజు జరుగుతున్న నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో నేపాల్ జట్టును ప్రోత్సహించేందుకు ఓ బీర్ కంపెనీ ముందుకు వచ్చింది. నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ టీమిండియాతో మ్యాచ్‌లో తీసే ప్రతి వికెట్‌కు రూ.లక్ష నజరానా ఇస్తామని కీలక ప్రకటన చేసింది. మరోవైపు బ్యాటర్లకు కూడా ఆఫర్ ఇచ్చింది. టీమిండియా బౌలర్లు వేసే బంతిని సిక్సర్ బాదితే.. ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి ఇస్తామని వెల్లడించింది. అలాగే ఫోర్ బాదితే రూ.25 వేలు ఇస్తామని తెలిపింది.

ఇది కూడా చదవండి: Jasprit Bumrah: తండ్రైన టీమిండియా పేస్ గన్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!

ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్‌ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇలా నజరానా ప్రకటించినట్లు అర్ణ బీర్ కంపెనీ అభిప్రాయపడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తేలిపోయారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కానీ లక్ష్యఛేదనలో నేపాల్ మాత్రం చతికిలపడింది. పాకిస్థాన్ బౌలర్లు విజృంభించడంతో 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కాగా టీమిండియా-నేపాల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం వల్ల టీమిండియా ఖాతాలో ఒకే ఒక్క పాయింట్ ఉంది. నేపాల్ ఇంకా ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-4లో అడుగుపెట్టనుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు పాయింట్లతో టీమిండియాకు సూపర్-4 బెర్త్ ఖరారు అవుతుంది. మరి ఒకవేళ మ్యాచ్ పూర్తిగా జరిగితే బీర్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చినందుకు నేపాల్ ఆటగాళ్లు రెచ్చిపోతారా.. లేదా మరోసారి చతికిలపడతారా అన్నది వేచి చూడాలి.

Updated Date - 2023-09-04T15:03:04+05:30 IST