Border-Gavaskar Trophy 2023: కెప్టెన్‌గా ఆ టెస్టు గర్వకారణం: రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2023-03-13T17:33:29+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar)లో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు

Border-Gavaskar Trophy 2023: కెప్టెన్‌గా ఆ టెస్టు గర్వకారణం: రోహిత్ శర్మ

అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar)లో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు అత్యంత కీలకంగా మారిందని టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఆ టెస్టులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మొత్తంగా పది వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు.

అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ 2-1తో భారత్ సొంతమైంది. మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ.. సిరీస్‌లో తొలి రెండు టెస్టులను గెలుచుకోవడం ఎంత ముఖ్యమో తమకు తెలుసన్నాడు. ఓ కెప్టెన్‌గా ఢిల్లీ టెస్టు తనకు నిజంగా గర్వకారణమన్నాడు. తొలుత ఈ మ్యాచ్‌లో తాము వెనకబడినా ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పంజుకుని పోరాడామన్నాడు. బోల్డన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అద్భుతంగా ప్రతిస్పందించామన్నాడు.

అహ్మదాబాద్ టెస్టు డ్రా అయినప్పటికీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జట్టు చేరుకుంది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందడుగు వేసింది. ఈ టెస్టులో ఓడిన శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జూన్ 7న ‘ద ఓవల్’లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.

Updated Date - 2023-03-13T17:33:29+05:30 IST