ODI World cup: ఆ జట్టుకు గాయాల బెడద.. 15 మందిలో ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2023-11-02T15:11:35+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.
వన్డే ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో అదరగొట్టిన న్యూజిలాండ్ టీమిండియాతో మ్యాచ్ అనంతరం డీలా పడిపోయింది. వరుసగా మూడు పరాజయాలతో సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఆ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో విలియమ్సన్ ఎడమ చేతి బొటన వేలుకు ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో అతడు అప్పటి నుంచి మళ్లీ మ్యాచ్ ఆడలేకపోయాడు. అనంతరం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్ చాప్‌మన్ పిక్క గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఫెర్గూసన్ కూడా గాయపడ్డాడు. దాంతో అతడు ఆట మధ్యలోనే పక్కకు తప్పుకున్నాడు.
బుధవారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా గాయపడి బౌలింగ్ మధ్యలోనే మైదానం బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతడి కోటాను జిమ్మీ నీషమ్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లోనే జిమ్మీ నీషమ్ కూడా గాయపడటం న్యూజిలాండ్ కష్టాలను మరింత రెట్టింపు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ కొట్టిన షాట్ నీషమ్ మోకాలికి బలంగా తాకడంతో అతడు కూడా గాయపడ్డాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ లేకపోవడంతో నీషమ్ గాయంతోనే ఫీల్డింగ్, బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 15 మంది స్క్వాడ్‌లో ఐదుగురు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటంతో తదుపరి మ్యాచ్‌లో తుది జట్టులో 11 మంది ఎవరు ఆడతారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆ జట్టు సెమీస్ చేరుతుందా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు. లీగ్ దశలో ఇంకా కివీస్ జట్టు పాకిస్థాన్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ గెలిచి తీరాలి.