Gautham Gambhir: ఆస్ట్రేలియాకు క్రీడా స్ఫూర్తి వర్తించదా?

ABN , First Publish Date - 2023-07-03T14:18:44+05:30 IST

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను విజయం ఊరించినా చివరకు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా గెలిచిన తీరు వివాదాస్పదంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో ఔటైన విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

Gautham Gambhir: ఆస్ట్రేలియాకు క్రీడా స్ఫూర్తి వర్తించదా?

క్రికెట్ అభిమానులకు యాషెస్ సిరీస్ కాక రేపుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్నా ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను విజయం ఊరించినా చివరకు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా గెలిచిన తీరు వివాదాస్పదంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో ఔటైన విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కూడా ఆస్ట్రేలియా ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టాడు. క్రీడా స్ఫూర్తి ఆస్ట్రేలియా జట్టుకు వర్తించదా అంటూ ప్రశ్నించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘హే స్లెడ్జర్స్.. క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా.. కేవలం భారతీయులకేనా?’ అంటూ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్ ట్వీట్ కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు గంభీర్‌కు మద్దతు పలుకుతున్నారు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియా ప్రవర్తనపై విమర్శలు చేశాడు. ఇది ఫెయిర్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అసలు ఏం జరిగిందంటే..?

రెండో టెస్టు చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ స్కోరు 193/5 వద్ద ఉన్న సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ కామెరూన్ గ్రీన్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి బెయిర్ స్టో కిందపడ్డాడు. అయితే బాల్ డైరెక్టుగా కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. ఇంతలో ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు దాటాడు. కానీ కీపర్ క్యారీ మాత్రం బాల్‌తో స్టంప్స్‌కు గిరాటేశాడు. బెయిర్ స్టో ఔట్ అయ్యాడని ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. ఈ పరిణామంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు, అభిమానులు బిత్తరపోయారు. అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించడంతో బెయిర్ స్టో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ వికెట్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది.

Updated Date - 2023-07-03T14:20:58+05:30 IST