Share News

IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ప్రకటన

ABN , Publish Date - Dec 15 , 2023 | 06:11 PM

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది.

IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ప్రకటన

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవల ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడికి సారథ్య బాధ్యతలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ తాజా నిర్ణయంతో రోహిత్ శర్మ భవితవ్యంపై సస్పెన్స్ నెలకొంది. గతంలో ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ ఛాంపియన్‌గా నిలిపినా.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తు్న్నారు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో కూడా టీమిండియాను రోహిత్ ఫైనల్‌కు చేర్చాడని.. అలాంటి ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వకుండా కెప్టెన్సీ తప్పించడం పెద్ద తప్పు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ ఇప్పటివరకు 158 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా.. 87 విజయాలు అందించాడు. ఈ జాబితాలో 67 పరాజయాలు, 4 టైలు ఉన్నాయి. కాగా రోహిత్‌ను తప్పించడంపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్ధనే స్పందించాడు. రోహిత్ అసాధారణ నాయకత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడు మంచి ప్రదర్శన చేశాడని.. అతడి నాయకత్వం జట్టుకు అసామాన విజయాలను అందించిందని ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ అత్యుత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా కెప్టెన్‌ను మార్చడం జరిగిందని.. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని భావిస్తున్నట్లు జయవర్ధనే అన్నాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 06:30 PM