Team India: 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేది వీళ్లేనా?
ABN , First Publish Date - 2023-10-23T20:56:38+05:30 IST
2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.
ప్రస్తుతం టీమిండియాను చూస్తుంటే సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికగా కనిపిస్తోంది. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ లాంటి సీనియర్లు.. ఇటు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ లాంటి యువ ఆటగాళ్లు జోరు మీద ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు తదుపరి ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండే అవకాశం అయితే లేదు. దీంతో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది. ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో చాలా మంది 2027 ప్రపంచకప్ ఆడనున్నారు. వాళ్లు ఎవరన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వయసు ప్రకారం చూస్తే హార్దిక్ పాండ్య 2027 వన్డే ప్రపంచకప్ కెప్టెన్‌గా కనిపించే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యషస్వీ జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ముగ్గురు కచ్చితంగా ఓపెనింగ్ స్థానాలకు ఎంపిక అవుతారని అభిమానులు భావిస్తున్నారు. మిడిలార్డర్ కోసం శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకూ సింగ్ పోటీ పడనున్నారు. ఆల్‌రౌండర్ స్థానాల కోసం కృనాల్ పాండ్య, శివం దూబె, అభిషేక్ శర్మ, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు సిద్ధం కానున్నారు. బౌలింగ్ దళానికి జస్ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది. వాళ్లతో పాటు అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్లు ప్రపంచకప్ జట్టులో ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు. వీళ్లే కాకుండా వచ్చే నాలుగేళ్లలో ఐపీఎల్‌తో సత్తా చాటుకునే యువ ఆటగాళ్లు కూడా 2027 ప్రపంచకప్ కోసం సిద్ధమయ్యే అవకాశాలు ఉంటాయి.