Team India: భారత్-ఐర్లాండ్ మధ్య మధ్య టీ20 సిరీస్!
ABN , First Publish Date - 2023-02-06T20:56:59+05:30 IST
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఐర్లాండ్(Ireland)లో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు మధ్యలో రెండు దేశాల మధ్య సిరీస్
న్యూఢిల్లీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఐర్లాండ్(Ireland)లో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు మధ్యలో రెండు దేశాల మధ్య సిరీస్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరగనున్న టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. గతేడాదిలానే ఈసారి కూడా భారత జట్టు(Team India) యూరోపియన్ జట్టుతో ఐర్లాండ్‌లో తలపడనున్నట్టు తెలుస్తోంది. 2024లో ఐసీసీ నుంచి మరో ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందేముందు ఐర్లాండ్‌కు ఈ సిరీస్ బాగా ఉపకరించే అవకాశం ఉంది.
2022లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) సారథ్యంలోని భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. పసికూన అయినప్పటికీ ఆ సిరీస్‌లో ఐర్లాండ్ జట్టు భారత్‌కు గట్టిపోటీ ఇచ్చింది. వచ్చే సిరీస్‌లోనూ గట్టి పోరాట పటిమ కనబర్చే అవకాశం ఉంది.
పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. అన్నిసార్లు భారత జట్టే విజయం సాధించింది. అయితే, ఈ పర్యటనపై బీసీసీఐ(BCCI) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి రెండు నెలల ముందే ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) కోసం సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు నాగ్‌పూర్‌లో ఈ నెల 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది.