India vs Australia: రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఎట్టకేలకు పెదవి విప్పిన రోహిత్ శర్మ
ABN , First Publish Date - 2023-02-28T16:51:29+05:30 IST
ఇటీవలి కాలంలో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul)పై జరుగుతున్నంత
ఇండోర్: ఇటీవలి కాలంలో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul)పై జరుగుతున్నంత చర్చ మరెవరిపైనా జరగడం లేదు. ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న రాహుల్(Rahul) ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మూడో టెస్టు రేపటి (మార్చి 1) నుంచి ప్రారంభం కానుండగా ఇటీవల మిగతా రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
ఇప్పటి వరకు టెస్టుల్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్(KL Rahul) నుంచి ఆ ట్యాగ్ లాగేసుకుంది. అలాగని, ఇంకెవరికీ ఆ పదవిని అప్పగించలేదు. అప్పటి నుంచి రాహుల్‌పై చర్చ మరింత ఎక్కువైంది. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు సరే.. జట్టు నుంచి ఎప్పుడు తప్పిస్తారంటూ పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐని ప్రశ్నిస్తూ వస్తున్నారు. శుభమన్ గిల్ లాంటి అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉండగా ఇంకా ఫామ్‌లో లేని రాహుల్(Rahul)ను ఇంకా ఆడిస్తుండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రాహుల్‌పై ఇంత చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు పెదవి విప్పని టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) తాజాగా ఈ విషయంలో స్పందించాడు. రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడమంటే ఇంకేదో విషయం గురించి సంకేతం ఇస్తున్నట్టు కాదని స్పష్టం చేశాడు. మేనేజ్‌మెంట్ ఎప్పుడూ శక్తిసామర్థ్యాలున్న ఆటగాళ్ల పక్షాన నిలుస్తుందని తేల్చి చెప్పాడు.
రాహుల్ 47 టెస్టుల తర్వాత అతడి సగటు 33.4 మాత్రమే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇరగదీస్తున్న శుభమన్ గిల్ ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు, రాహుల్ గత 10 ఇన్నింగ్స్‌లో ఒక్కదాంట్లోనూ 25 పరుగులకు మించి చేయలేకపోయాడు.
రాహుల్(Rahul) వైస్ కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ మాట్లాడుతూ.. ప్లేయర్లకు కష్టకాలం నడుస్తున్నప్పుడు.. తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అలాంటి వారికి మరింత సమయం లభిస్తుందన్నాడు. అతడు వైస్ కెప్టెనా? కాదా? అన్నది ఇక్కడ సమస్య కాదన్నాడు. అతడు (రాహుల్) వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో బహుశా అతడే సీనియర్ అని చెప్పాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా తొలగించడం అంటే ఇంకేదో సంకేతం ఇచ్చినట్టు కాదని రోహిత్ శర్మ వివరించాడు. ప్రాక్టీస్ సెషన్‌లో శుభమన్ గిల్ యాక్టివ్‌గా కనిపించాడని, మరి అతడికి మూడో టెస్టులో చోటు లభిస్తుందా? అన్న ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ.. తుది జట్టు టాస్ తర్వాతే నిర్ణయం అవుతుందన్నాడు.