India vs New Zealand: సెంచరీతో కదంతొక్కిన గిల్.. కివీస్‌కు కష్టమే!
ABN , First Publish Date - 2023-02-01T20:53:57+05:30 IST
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో భారత్
అహ్మదాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో భారత్(Team India) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి పర్యాటక జట్టు(Kiwis)కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి రెండు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్(Shubman Gill) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 54 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. మొత్తంగా 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు చేసిన గిల్.. టీ20 అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.
గిల్ దెబ్బకు స్కోరు బోర్డు అలుపు సొలుపు లేకుండా పరుగులు తీసింది. చివరికి 234 పరుగుల వద్ద ఆగింది. మరోవైపు, రాహుల్ త్రిపాఠి కూడా క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్‌కు పనిచెప్పాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 13 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 24, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశారు.