Madras High Court: ధోనీ పరువునష్టం దావా కేసు.. ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష
ABN , Publish Date - Dec 15 , 2023 | 03:38 PM
Madras High Court: 2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు. సదరు అధికారి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తన 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ధోనీ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని టీవీ యాజమాన్యానికి, ఐపీఎస్ అధికారి సంపత్‌కు నోటీసులు జారీ చేసింది. ధోనీ నోటీసులపై టీవీ ఛానల్ ఇచ్చిన వివరణను కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్‌పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఐపీఎస్ అధికారి సంపత్ఇచ్చిన వివరణపై ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి మద్రాస్ హైకోర్టును ధోనీ కోరాడు. ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారించిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. కానీ శిక్ష అమలును హైకోర్టు నెల రోజులు వాయిదా వేసింది. ఈ శిక్షను పైకోర్టులో సవాల్చేసుకునేందుకు వీలుగా 30 రోజుల వరకు శిక్ష అమలును నిలుపుదల చేస్తూ అదేశాలు జారీ చేసింది.
కాగా 2013 ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ తర్వాత కొందరు బుకీల నుంచి ఆయన లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయన్ను కేసు నుంచి తప్పించి సస్పెండ్ చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2019లో ట్రయల్ కోర్టు ద్వారా సంపత్ సస్పెన్షన్ నుంచి విముక్తి పొందారు. బెట్టింగ్ స్కాం వెలుగులోకి రాకుండా ఉండేందుకు కొందరు కుట్ర పన్ని తనను సస్పెండ్ చేసేలా ప్రేరేపించారని సంపత్ ఆరోపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.