Hasan Raja Controversy: పాకిస్థాన్ ఆటగాడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన షమీ
ABN , First Publish Date - 2023-11-08T20:26:39+05:30 IST
Mohammad Shami: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా బౌలర్లు చెలరేగుతుండటంపై ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని చెక్ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. హసన్ రజా వ్యాఖ్యలపై వసీం అక్రమ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా టీమిండియా బౌలర్ షమీ కూడా స్పందించాడు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు.
Mohammad Shami: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకువెళ్తుండటంపై కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో టీమిండియాపై విమర్శలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా అయితే తన విమర్శలతో రెచ్చిపోతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఒక్కటే వేరే బాల్స్‌తో ఆడుతోందని.. అందుకే వికెట్లు చకచకా పడగొడుతోందని ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి 55 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన చూసిన తర్వాత హసన్ రజా వాళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ, ఐసీసీ, థర్డ్ అంపైర్ కలిసి భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారని నోరుపారేసుకున్నాడు. ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. తాజాగా ఆప్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కూడా తొలుత ఆప్ఘన్ బౌలర్లకు టీమిండియా వాడే బంతులు ఇచ్చారని.. అందుకే వాళ్లు వికెట్లు తీశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అయితే హసన్ రజా వ్యాఖ్యలను పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ఖండించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్ పరువు తీయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా హసన్ రజా కామెంట్లపై టీమిండియా ఆటగాడు షమీ స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాస్త అయినా సిగ్గుపడాలని ఎద్దేవా చేశాడు. ఆటపై ఫోకస్ పెట్టాలి కానీ ఇలాంటి బక్వాస్ మాటలు మాట్లాడొద్దని షమీ హెచ్చరించాడు. ఇతరుల విజయాలను చూసి కనీసం కొన్నిసార్లు అయినా ఆనందించాలని హితవు పలికాడు. ఇది ఐసీసీ ప్రపంచకప్ అని.. గల్లీ క్రికెట్ కాదని గుర్తుచేశాడు. నువ్వు కూడా క్రికెటర్‌వే కదా అని.. ఈ విషయం కూడా తెలియదా అని ప్రశ్నించాడు. వసీం అక్రమ్ ఇప్పటికే అర్థమయ్యేలా చెప్పాడని.. కనీసం మీ దేశానికి చెందిన ఆటగాడు చెప్పిన విషయాన్ని అయినా నమ్మాలని షమీ సూచించాడు. అయితే హసన్ రజా పేరు ప్రస్తావించకుండానే అతడి వ్యాఖ్యలకు షమీ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.