ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు.. ఒక్క బంతికే 13 పరుగులు

ABN , First Publish Date - 2023-10-10T15:09:05+05:30 IST

న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ బ్యాస్ డి లీడే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 13 పరుగులు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు.. ఒక్క బంతికే 13 పరుగులు

వన్డే ప్రపంచకప్ రోజురోజుకు ఆసక్తిగా సాగుతోంది. ప్రస్తుతం ఎక్కువగా చిన్నజట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నా భారీ స్కోర్లు నమోదు అవుతుండటంతో క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ బ్యాస్ డి లీడే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 13 పరుగులు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిందంటే.. డచ్ బౌలర్ బ్యాస్ డి లీడే వేసిన ఆఖరి బంతి నోబాల్ అయ్యింది. సదరు బాల్ నడుము ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో నోబాల్ అని అంపైర్ ప్రకటించాడు. ఈ బంతిని శాంట్నర్ సిక్స్ కొట్టడంతో మొత్తం ఏడు పరుగులు వచ్చాయి. మరోవైపు నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ కూడా వచ్చింది. ఫ్రీ హిట్ బాల్‌ను నెదర్లాండ్స్ బౌలర్ ఫుల్ టాస్ వేయడంతో శాంట్నర్ మరో సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క బాల్‌కు 13 పరుగులు వచ్చినట్లు అయ్యింది.

ఇది కూడా చదవండి: Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (70), రచిన్ రవీంద్ర (51), కెప్టెన్ టామ్ లాథమ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. శాంట్నర్‌ 17 బంతుల్లోనే 36 పరుగులు చేసి న్యూజిలాండ్ స్కోరు 300 రన్స్ దాటడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ శాంట్నర్ ధాటికి 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శాంట్నర్ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేశాడు. అతడు 59 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ కప్‌లో ఐదు వికెట్లు తీసిన మొదటి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా కూడా శాంట్నర్‌ రికార్డు సృష్టించాడు.

Updated Date - 2023-10-10T15:09:05+05:30 IST