Share News

PAK Vs NZ: పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ భారీ స్కోరు.. పాకిస్థాన్‌కు మళ్లీ ఓటమేనా?

ABN , First Publish Date - 2023-11-04T14:58:45+05:30 IST

బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.

PAK Vs NZ: పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ భారీ స్కోరు.. పాకిస్థాన్‌కు మళ్లీ ఓటమేనా?

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తట్టా బుట్ట సర్దుకోవాల్సిన తరుణం దగ్గర పడినట్లే కనిపిస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర 94 బాల్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేశాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ 79 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 రన్స్ సాధించాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ స్కోరు 400 దాటింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ ఒక్కడే రాణించాడు. అతడు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 60 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు రౌఫ్ బౌలింగ్‌లో బ్యాటర్లు 16 సిక్సర్లు బాదారు. ఈ టోర్నీలో ఒక బౌలర్‌కు ఇదే అత్యధికం. అలాగే ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా షాహిన్ షా అఫ్రిది నిలిచాడు. అతడు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 90 రన్స్ సమర్పించుకున్నాడు. మరోవైపు హసన్ అలీ కూడా భారీగానే పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 82 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 400 రన్స్‌కు పైగా టార్గెట్ ఛేదించడం అంటే మాటలు కాదు. ఒకవేళ ఛేదిస్తే ఇదే రికార్డు అవుతుంది. కానీ పాకిస్థాన్‌కు అంత సీన్ లేదని.. ఆ జట్టుకు ఓటమి ఖాయమని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు.

Updated Date - 2023-11-04T14:58:46+05:30 IST