PAK Vs SA: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఇదే..!!
ABN , First Publish Date - 2023-10-27T18:06:29+05:30 IST
చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. పూర్తి ఓవర్లు ఆడి ఉంటే కనీసం 300కు పైగా లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచేది. కానీ పాకిస్థాన్ బ్యాటర్లలో నిలకడ లోపించింది. 38 పరుగులకే ఓపెనర్ల వికెట్లను పాకిస్థాన్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇమాముల్ హక్ (12), అబ్దుల్లా షఫీక్ (9) దారుణంగా విఫలమయ్యారు. అద్భుత ఫామ్‌లో ఉన్న మహ్మద్ రిజ్వాన్ కూడా 31 పరుగులకే పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 65 బాల్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 50 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. షకీల్ 52 బాల్స్‌లో 7 ఫోర్లు సహాయంతో 52 రన్స్ చేశాడు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షాంసీ 4 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. మార్కో జాన్సన్ 3 వికెట్లతో పాకిస్థాన్ పతనానికి నాంది పలికాడు. జూనియర్ డేల్ స్టెయిన్‌గా పేరు పొందిన గెరాల్డ్ కోయిట్జె 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవాలంటే బౌలర్లు రాణించాల్సి ఉంది. టోర్నీలో భారీ స్కోర్లు చేస్తున్న దక్షిణాఫ్రికాను వాళ్లు ఏ మాత్రం నియంత్రిస్తారో వేచి చూడాలి.