ODI World Cup: ఇంగ్లండ్ బాటలోనే పాకిస్థాన్.. సెమీస్ రేసు నుంచి అవుట్..!!
ABN , First Publish Date - 2023-10-27T22:39:06+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. దీంతో అద్భుతాలు జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదు. అగ్రశ్రేణి జట్లలో ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఇప్పుడు ఇంగ్లండ్ బాటలోనే పాకిస్థాన్ నడుస్తోంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. టీమిండియా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వరుసగా పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఇంకా బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిచినా పాకిస్థాన్ ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ 10 పాయింట్లతో సెమీస్‌కు వెళ్లాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మిగతా అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి. కానీ వాళ్లకు ఇంకా చిన్న జట్లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు కష్టమే అని చెప్పవచ్చు.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 271 పరుగుల టార్గెట్ నిలిచింది. అయితే ఓ దశలో డ్రామా నెలకొంది. మార్‌క్రమ్ అవుటైన తర్వాత దక్షిణాఫ్రికా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 260/9తో నిలిచింది. దక్షిణాఫ్రికాకు 11 పరుగులు, పాకిస్థాన్ ఒక్క వికెట్ కావాల్సి ఉండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. అంపైర్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న దక్షిణాఫ్రికా చివరకు ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. 1999 వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా గెలవడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం.