Gongadi Trisha: భద్రాద్రి రామబాణం గొంగడి త్రిష.. ఆకాశానికెత్తేసిన రేవంత్‌రెడ్డి.. ఎవరీ త్రిష?

ABN , First Publish Date - 2023-01-30T17:32:58+05:30 IST

దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం ఇంగ్లండ్‌తో

Gongadi Trisha: భద్రాద్రి రామబాణం గొంగడి త్రిష.. ఆకాశానికెత్తేసిన రేవంత్‌రెడ్డి.. ఎవరీ త్రిష?

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌ను ముద్దాడారు. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో మూడు ఫోర్లతో 24 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha)పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రశంసలు కురిపించారు.

మట్టిలో మాణిక్యం మన త్రిష అని కీర్తించారు. విశ్వక్రీడా వేదికపై భారత కీర్తి పతాకను ఎగరేసిన భద్రాద్రి ‘రామబాణం’ అంట ఆకాశానికెత్తేశారు. లక్షలాది యువ తరంగాలకు ఆమె మరో స్ఫూర్తిగీతమని అన్నారు. మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టును విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన త్రిషకు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నట్టు రేవంత్ ట్వీట్ చేశారు.

దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌‌(Potchefstroom)లో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు ఆల్‌రౌండ్ ప్రతిభతో కప్పునుకు కొట్టుకొచ్చారు. ఇంగ్లండ్‌(England)ను తొలుత 17.1 ఓవర్లలో 68 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు(Team India) ఆపై 14 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుని ప్రపంచకప్‌ను సగర్వంగా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గొంగడి త్రిష 29 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి జట్టును విజయ పథంలో నడిపింది. భారత జట్టు విజయం సాధించగానే త్రిష సొంతూరు భద్రాచలం(Bhadrachalam)లో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రూప్ దశలోనూ త్రిష సత్తా చాటింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్ధ సెంచరీ (57) సాధించి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన త్రిష 116 పరుగులు చేసింది.

త్రిష ఎవరు?

త్రిష తండ్రి గొంగడి రామిరెడ్డి. భద్రాచలంలో ఆయనకు జిమ్ ఉంది. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న త్రిషకు తండ్రి శిక్షణ ఇప్పించారు. ఎనిమిదేళ్ల వయసులోనే క్రికెట్‌లో ప్రతిభ చాటిన త్రిష.. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 12 ఏళ్ల వయసులో రాష్ట్ర అండర్-12 జట్టుకు ఆడింది. ఆ తర్వాత తన ప్రతిభకు మరింత పదును పెడుతూ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. అండర్-19 జట్టుకు ఎంపికైన త్రిష శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాణించడంతో అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఆమెకు చోటు లభించింది.

Updated Date - 2023-01-30T17:33:00+05:30 IST