Sarfaraz Khan: ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టు ఎంపిక వివాదాస్పదం.. సర్ఫరాజ్ ఖాన్ రియాక్షన్ ఇదీ!
ABN , First Publish Date - 2023-01-14T21:04:04+05:30 IST
ఆస్ట్రేలియాతో వచ్చే నెలలో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ నిన్న భారత జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో తలపడే తొలి రెండు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో వచ్చే నెలలో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ నిన్న భారత జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో తలపడే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు బదులు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు కల్పించడం వివాదాస్పదమైంది.
మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా బీసీసీఐ (BCCI) నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కూడా సెలక్టర్ల తీరును దుయ్యబట్టాడు. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు తనను ఎంపిక చేయకపోవడంపై సర్ఫరాజ్ తప్పుగా అనుకునే అవకాశం ఉందన్నాడు. సర్ఫరాజ్ గత రెండు సీజన్లుగా రంజీల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. టెస్టు జట్టులో పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ఓ స్థానాన్ని సర్ఫరాజ్ భర్తీ చేస్తాడని అనుకున్నానని అన్నాడు. కానీ, అలా జరగలేదన్నాడు. ఈ వివాదంపై తాజాగా, సర్ఫరాజ్ కూడా స్పందించాడు. టెస్టు జట్టుకు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో తన గణాంకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ సగటు 80.47. దిగ్గజ బ్రాడ్‌మన్(Don Bradman) తర్వాత ఇది రెండో అత్యుత్తమ సగటు. అలాగే, ముంబై తరపున తన సగటు 110.73. ఈ విషయాన్ని సర్ఫరాజ్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించాడు. కాగా, ఇండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్‌కు తొలిసారి టెస్టు జట్టులో చోటు లభించింది. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు చోటిచ్చారు.