Shahid Afridi: నవీన్ ఉల్ హక్‌కు షాహిద్ అఫ్రిది సలహా.. కోహ్లీతో గొడవ తర్వాత వైరల్!

ABN , First Publish Date - 2023-05-02T15:59:02+05:30 IST

నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq).. ఇప్పుడీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. కారణం.. ఈ ఆఫ్ఘాన్

Shahid Afridi: నవీన్ ఉల్ హక్‌కు షాహిద్ అఫ్రిది సలహా.. కోహ్లీతో గొడవ తర్వాత వైరల్!

లక్నో: నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq).. ఇప్పుడీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. కారణం.. ఈ ఆఫ్ఘాన్ ఫాస్ట్ బౌలర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో గొడవ పడడమే. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య సోమవారం లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో పరస్పరం గొడవ పడిన కోహ్లీ, నవీన్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించగా, నవీన్‌కు 50 శాతం జరిమానా విధించింది. ఈ ఇద్దరి గొడవ తర్వాత పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది డిసెంబరు 2020లో చేసిన ట్వీట్ ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.

లంక ప్రీమియర్ లీగ్ (LPL) ప్రారంభ ఎడిషన్‌లో క్యాండీ టస్కర్స్-గాలె గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నవీన్ వివాదంలో చిక్కుకున్నాడు. మహమ్మద్ ఆమిర్‌- నవీన్ మాటల యుద్ధానికి దిగారు. ఆ తర్వాత ఆఫ్రిదితోనూ నవీన్ వాగ్వివాదానికి దిగాడు.

ఈ ఘటన తర్వాత నవీన్ ఉల్ హక్‌కు అఫ్రిది సలహా ఇచ్చాడు. ఎవరిపైనా నోరు జారొద్దని, జట్లను, ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించాలని సూచించాడు. ‘‘యువ ఆటగాళ్లకు నేనిచ్చే సలహా చాలా సింపుల్. మ్యాచ్ ఆడండి. అంతేకానీ, దుర్భాషలు వద్దు. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో నాకు స్నేహితులున్నారు. మా మధ్య మంచి సంబంధాలున్నాయి. సహచరులను, ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవించడమనేది గేమ్ స్పిరిట్‌లో మొదటిది’’ అని ట్వీట్ చేశాడు.

దీనికి నవీన్ స్పందిస్తూ.. ‘‘సలహాలను స్వీకరించేందుకు, గౌరవం ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధం. క్రికెట్ జెంటిల్మన్ గేమ్. కానీ మీరందరూ మా కాళ్ల కింద పడి ఉండాలి, వారి దగ్గరే ఉండాలని ఒకరు అంటే, అతడు నా ఒక్కరి గురించి మాత్రమే కాదు, మా వారిని కూడా అన్నాడు’’ అని బదులిచ్చాడు.

టీ20 ఫార్మాట్‌లో నవీన్ అనుభవం ఉన్న ఆటగాడు. 2017 నుంచీ ఆడుతున్నాడు. 136 టీ20 గేమ్స్‌లో 167 వికెట్లు పడగొట్టాడు. నాలుగుసార్లు మూడు వికెట్లు చొప్పున, ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. సెప్టెంబరు 2016 నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ తరపున 7 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2023-05-02T15:59:02+05:30 IST