Cricket World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌కు ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి డెంగ్యూ ఫీవర్..!

ABN , First Publish Date - 2023-10-06T11:59:34+05:30 IST

భారత్ వేదికగా క్రికెట్ సంరంభం ‘క్రికెట్ వరల్డ్ కప్ 2023’ (Cricket World Cup 2023) మొదలైంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లంగ్‌పై న్యూజిలాండ్ గెలిచి శుభారంభం చేసింది. ఇక ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.

Cricket World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌కు ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి డెంగ్యూ ఫీవర్..!

చెన్నై: భారత్ వేదికగా క్రికెట్ సంరంభం ‘క్రికెట్ వరల్డ్ కప్ 2023’ (Cricket World Cup 2023) మొదలైంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లంగ్‌పై న్యూజిలాండ్ గెలిచి శుభారంభం చేసింది. ఇక ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. అయితే తొలి మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు బ్యాడ్ న్యూస్ తెలిసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌కు ఓపెనర్‌ దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే శుక్రవారం మరో దఫా పరీక్షించిన తర్వాత తొలి మ్యాచ్‌లో ఆడించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని జాతీయ మీడియా రిపోర్టులు ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే.


Untitled-5.jpg

"చెన్నై చేరుకున్ననాటి నుంచి శుభ్‌మన్‌ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతనికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం మరో దఫా పరీక్షలు జరుగుతాయి. అనంతరం అతడిని ఆరంభ మ్యాచ్‌లో ఆడించడంపై తుది నిర్ణయం ఉంటుంది" అని బీసీసీఐకి (BCCI) చెందిన విశ్వసనీయమైన వర్గాలు వెల్లడించాయి. "ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సినంత కంగారు లేదు. ఇది సాధారణ వైరల్ జ్వరం అయితే యాంటీబయాటిక్స్‌ తీసుకొని ఆడగలడు. ఏ విషయమైందీ వైద్య బృందం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కాగా డెంగ్యూ నుంచి కోలుకోవడం వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 7-10 రోజుల సమయం పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.


గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌..!

ఒకవేళ గిల్ కోలుకోక మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే పరిస్థితి లేకపోతే అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. గిల్ 2023లో వన్డేలలో 72.35 సగటుతో 1,230 పరుగులు చేశారు. అతడి స్ట్రైక్ రేటు 105 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మొత్తం 5 సెంచరీలు, 5 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇందులో 208 పరుగుల డబుల్ సెంచరీ కూడా ఉంది. ఫామ్ దృష్ట్యా ఇషాన్‌నే ఓపెనర్‌గా ఆడించే సూచనలున్నాయి.

Updated Date - 2023-10-06T12:09:36+05:30 IST