South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!
ABN , First Publish Date - 2023-10-24T19:18:17+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ నుంచే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. గత 8 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఆ జట్టు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది.
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య ప్రదర్శన చేస్తోంది. టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లు హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగగా.. సఫారీలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండానే భారత్‌కు వచ్చారు. కానీ తొలి మ్యాచ్ నుంచే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. గత 8 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఆ జట్టు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది. ఓడిపోయిన నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ సఫారీ బ్యాటర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు కూడా దక్షిణాఫ్రికా పంచ్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లోనూ 311 పరుగులు చేసి విజయం సాధించారు. దీంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా ఫేవరేట్‌గా మారి సెమీస్ రేసులోకి వచ్చింది. ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేయడం సఫారీలకు కలిసొచ్చిందనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: SA Vs BAN: డికాక్, క్లాసెన్ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా మళ్లీ భారీ స్కోరు
అయితే ప్రపంచకప్‌లో ఆడిన మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా పరాజయం పాలైంది. నెదర్లాండ్స్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో మెగా టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. కానీ నాలుగో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి 399 రన్స్ చేసిన సఫారీలు ఇంగ్లండ్‌ను 170 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సఫారీ బ్యాటర్లు రెచ్చిపోయారు. మరోసారి 382 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ టార్గెట్ విధించారు. దక్షిణాఫ్రికా ఇలాగే ఆడితే ప్రపంచకప్ ట్రోఫీ నెగ్గడం సులభమే అనిపిస్తోంది. అయితే వాళ్లకు ప్రకృతి ఎంత సహకరిస్తుందన్న విషయం కీలకంగా మారింది. నెదర్లాండ్స్ మ్యాచ్ ఓటమికి వర్షమే కారణమని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేయడం సఫారీలకు అలవాటేనని బలంగా నమ్ముతున్నారు.