ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు స్కోరు.. శ్రీలంక ముందు దక్షిణాఫ్రికా భారీ టార్గెట్

ABN , First Publish Date - 2023-10-07T18:36:19+05:30 IST

ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీల దాహం తీర్చుకున్నారు.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు స్కోరు.. శ్రీలంక ముందు దక్షిణాఫ్రికా భారీ టార్గెట్

వన్డే ప్రపంచకప్ ప్రారంభమై మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రపంచకప్ చరిత్రలోనే భారీ స్కోరు నమోదైంది. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీల దాహం తీర్చుకున్నారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ 100, వాండర్ డసెన్ 108, ఎయిడెన్ మార్‌క్రమ్ 106 సెంచరీలు చేసి తమ జట్టుకు భారీ స్కోరు అందించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేపట్టగా ఆరంభంలోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద కెప్టెన్ బవుమా(8) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో డసెన్ రంగంలోకి దిగాడు. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది.

ఇది కూడా చదవండి: Asian Games 2023: వర్షం వల్ల ఫైనల్ రద్దు.. అయినా టీమిండియాకు గోల్డ్ మెడల్

డికాక్ 84 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేయగా.. డసెన్ 110 బాల్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. జట్టు 214 పరుగుల స్కోరు వద్ద డికాక్ అవుటైనా మార్‌క్రమ్ అతడి బాధ్యతను తీసుకున్నాడు. మార్‌క్రమ్ 54 బాల్స్‌ మాత్రమే ఆడి 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. క్లాసెన్, మిల్లర్ కూడా సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో శ్రీలంక బౌలర్లందరూ దాదాపు ఓవర్‌కు ఆరు పైగా పరుగులు సమర్పించుకున్నారు. దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీయగా.. కాసున్ రజిత, మతీష పతిరణ, దునిత్ వెల్లలాగే ధారాళంగా పరుగులు ఇచ్చి తలో వికెట్ మాత్రమే తీశారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనించాల్సిన విషయం. శ్రీలంక గెలవాలంటే రికార్డు స్థాయిలో 429 పరుగులు చేయాలి.

Updated Date - 2023-10-07T18:36:19+05:30 IST