Rishabh Pant: తనను కాపాడిన వారిని కలిసిన రిషభ్ పంత్

ABN , First Publish Date - 2023-01-03T19:45:03+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తనను

Rishabh Pant: తనను కాపాడిన వారిని కలిసిన రిషభ్ పంత్
Rishabh Pant

డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తనను కాపాడిన వారిని కలిశాడు. ఢిల్లీ నుంచి కారులో డెహ్రాడూన్ (Dehradun) వెళ్తున్న పంత్ పాత్‌హోల్‌ను తప్పించే క్రమంలో డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక యువకులు రజత్, నిషు వెంటనే కారు వద్దకు పరిగెత్తుకెళ్లి పంత్‌ను కారు నుంచి బయటకు లాగారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే కారు కాలిబూడిద అయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న డ్రైవర్ సుశీల్ కుమార్ బస్సు ఆపి అంబులెన్స్‌కు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ను రజత్, నిషులు వెళ్లి కలిసి పరామర్శించారు. ప్రమాదం తర్వాత పంత్ వీరిద్దరిని కలుసుకోవడం ఇదే తొలిసారి. నిజానికి ఆ సమయంలో పంత్ ఎవరో తమకు తెలియదని, ఆ తర్వాత అతడు క్రికెటర్ అని తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో యువకులు చెప్పుకొచ్చారు.

యువకులు కలిసినప్పుడు తీసిన ఫొటోల్లో పంత్ ఒళ్లంతా బ్యాండేజీలతో కనిపించాడు. ఎడమ చేతికి డ్రిప్ అమర్చి ఉంది. పంత్‌ శరీరంపై పలుచోట్ల తీవ్రంగా గాయాలైనట్టు బీసీసీఐ(BCCI) పేర్కొంది. పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ భారత జట్టు సందేశం పంపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు ఉన్నారు.

Updated Date - 2023-01-03T19:45:05+05:30 IST